ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది.
By Srikanth Gundamalla Published on 28 July 2023 3:15 PM ISTఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టు 3 నుంచి తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూలై 31న మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తోన్న వర్షాలు, వరదలు, సహాయక చర్యలు సహా పలు అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. దాదాపు 40 అంశాల వరకు కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.
మంత్రి వర్గ సమావేశంలో ప్రధానంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంభవించిన వరదలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? రైతులకు ఎలా ఆదుకోవాలి? ప్రజలకు సాయం అందించడంపై చర్చించనున్నారు. ఇక తెలంగాణ వ్యవసాయ సాగు పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఈ క్రమంలో కురుస్తోన్న వర్షాల వల్ల వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేయనున్నారు. ప్రత్యామ్నాయ విధానాలపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలయమం అయ్యాయి. రోడ్లు తెగిపోయి.. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల వరదలో ప్రజలు కొట్టుకుపోయి మృత్యవాతపడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆయా అంశాలపై చర్చించనుంది. యుద్ధప్రాతిపదికన రోడ్లు పునరుద్ధరించడంపై చర్చించనుంది.
కాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన బీఏసీ సమావేశం జరగనుంది. ఈ భేటి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు.