అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు.. తెలంగాణలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌!

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి.. ఇప్పుడిదే రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.

By అంజి  Published on  8 Aug 2023 4:03 AM GMT
Telangana, assembly elections, election schedule

అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు.. తెలంగాణలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌!

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి, కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ని, నోటిఫికేషన్‌ని ఎప్పుడు వెలువరిస్తుంది.. ఇప్పుడు ఈ విషయాలే రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారాయి. అసెంబ్లీ గడువు పూర్తి అయ్యేందుకు కనీసం 60 రోజుల ముందే ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా ఉండబోతున్నాయి. బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఎదురవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా కొన్ని సమాచారా సాధనాలు, సోషల్‌ మీడియా గ్రూపులు.. 2018 ఎన్నికల షెడ్యూల్‌ని తాజా షెడ్యూల్‌గా ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిలో ఎలాంటి నిజం లేదు. ఇప్పటి వరకు ఈసీ ఎలాంటి షెడ్యూల్‌ని ప్రకటించలేదు.

ఎన్నికల నిపుణుల చెబుతున్న దాని ప్రకారం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడానికి జనవరి 16, 2024 వరకూ గడువు ఉంది. అసెంబ్లీ మొదటిసారిగా సమావేశమైన తేదీని ఐదేళ్ల కాలపరిమితికి ఎన్నికల సంఘం ప్రామాణికంగా తీసుకుంటుంది. ఈ లెక్కన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జనవరి 16లోపు పూర్తి కావాల్సి ఉంది. 2018లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాలతో కలిసి తెలంగాణకు ఎన్నికలు జరిగాయి. అయితే మిగతా రాష్ట్రాల కంటే ముందే మిజోరాం అసెంబ్లీ 2018 డిసెంబర్‌ 17 మొదటిసారి సమావేశమైంది. ఒక వేళ ఈసీ మిజోరాం అసెంబ్లీ మొదటిసారి సమావేశమైన తేదీని ప్రామాణికంగా తీసుకుని ఎన్నికల షెడ్యూల్‌ని రిలీజ్‌ చేస్తే.. డిసెంబర్‌ 17 లోపు అక్కడ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. దీని ప్రకారం.. అక్టోబర్‌ 17 కంటే ముందే ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనుంది.

గతంలోలాగే ఈసారి కూడా మిగతా నాలుగు రాష్ట్రాలతో కలిపి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. మిజోరాం అసెంబ్లీ తేదీనే ప్రామాణికంగా తీసుకుని మిగతా రాష్ట్రాలకు కూడా ఎన్నికల షెడ్యూల్‌ని రిలీజ్‌ చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ లెక్కన అక్టోబర్‌ 17 కంటే ముందే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావొచ్చని అంటున్నారు. విడివిడిగా షెడ్యూల్‌ ఇస్తే మాత్రం.. మిజోరాంకు ఎన్నికలు జరిగిన కొద్దివారాలకు తెలంగాణ ఎన్నికల షెడ్యూలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి షెడ్యూల్‌ విడుదలైతేనే దీనిపై స్పష్టత వస్తుంది.

Next Story