తెలంగాణ ఎన్నికల కోసం 26 మంది బీజేపీ ముఖ్య నేతలతో కేంద్ర కమిటీ
తెలంగాణ ఎన్నికల కోసం 26 మంది బీజేపీ ముఖ్య నాయకులతో కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Sept 2023 7:45 PM ISTతెలంగాణ ఎన్నికల కోసం 26 మంది బీజేపీ ముఖ్య నేతలతో కేంద్ర కమిటీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న బీజేపీ ఇప్పుడు రంగంలోకి దిగుతోంది. అక్టోబర్ తొలివారంలోనే ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ ఎన్నికల కోసం 26 మంది బీజేపీ ముఖ్య నాయకులతో కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కేంద్ర ఎన్నికల కమిటీలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్. విష్ణువర్ధన్‌రెడ్డిలు ఈ కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహించేందుకు బీజేపీ నాయకత్వం అవకాశం కల్పించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన ఉన్ పార్టీ నేతలు ఈ సారి తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. అయితే.. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఉన్న అనువైన పరిస్థితుల్లో అందర్నీ సమన్వయం చేసుకోవడం, అభ్యర్థుల ఎంపిక, వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిచడం, ప్రచారం, జాతీయ నేతలు బహిరంగ సభలు నిర్వహణ , ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన సాయం చేయడం వంటి బాధ్యతలను ఈ ఎన్నికల కమిటీ నిర్వహిస్తుంది. ఈ కమిటీలోని 26 మందిలో పలువురు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు.
తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకూ అంటే డిసెంబర్ మొదటి వారం వరకూ ఈ కమిటీ తెలంగాణలోనే పూర్తి సమయం ఉండి రాష్ట్ర , కేంద్ర మంత్రులు పార్టీ జాతీయ నాయకత్వంతో కలిసి పని చేస్తుంది. రానున్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపేందుకు ఈ కమిటీ పని చేయాలని కేంద్ర పార్టీ నుండి తరుణ్ చుగ్ (బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి) కేంద్ర జాతీయ కార్యాలయ నుండి కమిటీ లో ఉన్న నేతలకు ఆదేశాలు జారీ చేశారు.