Telangana: అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌.. పోలింగ్‌ మాత్రం అప్పుడే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్‌ని ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది.

By అంజి  Published on  25 Aug 2023 10:00 AM IST
Telangana, assembly elections, election schedule, ECI

Telangana: అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌.. పోలింగ్‌ మాత్రం అప్పుడే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్‌ని ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది. ఎన్నికల తేదీలను ఖరారు చేసేందుకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. అక్టోబర్‌ రెండో వారంలోగా షెడ్యూల్‌ని ప్రకటించనుందని సమాచారం. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల బృందం రాష్ట్రానికి రానుంది. ఎన్నికల సన్నద్ధతపై అధ్యయనం చేయనుంది. అక్టోబర్‌ ఫస్ట్‌ వీక్‌లో వచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్‌ ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. దీంతో 2018 అక్టోబరు 6న షెడ్యూల్‌ వచ్చింది. డిసెంబరు 7న పోలింగ్‌, జనవరి 17న అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత గడువు వచ్చే ఏడాది జనవరి 16 వరకు మాత్రమే ఉంది. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనుంది. మిజోరం అసెంబ్లీ గడువు మాత్రం ఈ ఏడాది డిసెంబరు 17తో ముగియనుంది. ఈ క్రమంలోనే తెలంగాణతోపాటు మిగిలిన 4 రాష్ట్రాలకు ఒకేసారి షెడ్యూలును ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా అక్టోబర్, నవంబర్‌ నెలల్లో ప్రభుత్వ సెలవులు, స్థానిక పండగల సెలవులపై ఎన్నికల సంఘం ఆరా తీసింది. అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో దసరా, బతుకమ్మ, దీపావళి పండగలు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలోనే కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ బృందం రెండు సార్లు రాష్ట్రంలో పర్యటిస్తుంది.

ఇదిలా ఉంటే.. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ రాష్ట్రంలో ముమ్మరంగా సాగుతోంది. ఇటీవల ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించారు. నవంబరు 4న తుది ఓటర్ల జాబితాను వెలువడనుంది. ఈ సారి కూడా డిసెంబరులోనే పోలింగు ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుగా ఎన్నికల సంఘం అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తోంది. డిసెంబరు రెండో వారంలోగా పోలింగును ముగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల పరిశీలకులను నియమించేందుకు అధికారుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. కీలక నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిశీలకులను నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Next Story