రేపే కౌంటింగ్.. తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు.
By అంజి Published on 2 Dec 2023 10:15 AM IST
రేపే కౌంటింగ్.. తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. నెల రోజుల పాటు ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకున్న అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 49 ప్రాంతాల్లో ఓట్లు లెక్కించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. హైదరాబాద్ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 4, నిజామాబాద్ జిల్లాలో రెండు ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఒకే చోట కేంద్రం ఉండగా.. మిగిలిన 28 జిల్లాల్లో ఒకటి చొప్పున లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లో 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఐదు వందలకు పైగా పోలింగ్ కేంద్రాలున్న 6 నియోజకవర్గాల్లో రెట్టింపు సంఖ్యలో ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఈవీఎంల లెక్కింపు కోసం 1766 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుళ్లు ఉంటాయి. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుంది. రాష్ట్రంలోని కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల సమీపంలో ఎలాంటి ఊరేగింపులు చేయొద్దని అధికారులు సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.80 లక్షల మంది ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. తక్కువ మంది అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల్లో ఉదయం పదిన్నరకే తొలి ఆధిక్యం తెలిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.