రూ.2.56ల‌క్ష‌ల కోట్ల‌తో తెలంగాణ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి హ‌రీశ్‌రావు

Telangana Assembly Budget Session 2022-23 Start.తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2022 6:56 AM GMT
రూ.2.56ల‌క్ష‌ల కోట్ల‌తో తెలంగాణ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి హ‌రీశ్‌రావు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి. 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన బ‌డ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ప్ర‌త్యేక రాష్ట్రంగా తెలంగాణ అవ‌త‌రించిన త‌క్కువ కాలంలోనే దేశంలోనే అగ్ర‌గామి రాష్ట్రంగా రూపుదాల్చింద‌న్నారు. సీఎం కేసీఆర్ సార‌థ్యంలో స్వ‌రాష్ట్ర స్వ‌ప్నం సాకార‌మైంద‌ని హ‌రీశ్‌రావు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా కేంద్ర ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాన్ని దుయ్య‌బ‌ట్టారు. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య వైఖ‌రిని ఎండ‌గట్టారు.

గ‌తంలో సాగునీరు, తాగునీరు, ఆక‌లి చావులు, క‌రెంటు కోత‌లు ఇలా ఎన్నో స‌మ‌స్య‌ల విల‌యంలో రాష్ట్రం కొట్టుమిట్టాడింద‌ని.. అయితే టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఒక్కో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటూ వెళ్లిన‌ట్లు చెప్పారు. ఇంకా వివ‌క్ష కొన‌సాగుతోంద‌ని.. కేంద్రం వైఖ‌రి కాళ్ల‌లో క‌ట్టేలు పెట్టే విధంగా ఉంద‌న్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌లు జ‌రుపుకోక‌ముందే ఖ‌మ్మంలోని ఏడు మండ‌లాల‌ను ఏపీకి క‌ట్ట‌బెట్టిందన్నారు. ఐదేళ్ల పాటు హైకోర్టు విభ‌జ‌న చేయ‌కుండా తాత్పారం చేసింద‌న్నారు. విభ‌జ‌న చ‌ట్టంలోని పేర్కొన్న హామీల‌ను ఇంకా అమ‌లు చేయ‌డం లేద‌న్నారు. జిల్లాల‌కు నిధులు కేటాయింపు విష‌యంలో ఆల‌స్యం చేస్తూ వ‌స్తోంద‌ని, రాష్ట్రాల అధికారాల‌ను క‌బ‌లిస్తోంద‌ని మండిప‌డ్డారు.

బీజేపీ ఎమ్మెల్యేల స‌స్పెండ్..

కేంద్రాన్ని మంత్రి హరీష్ విమర్శిస్తున్న క్రమంలో భారతీయ జ‌న‌తా పార్టీ సభ్యులు అడ్డు తగిలారు. బ‌డ్జెట్ ప్ర‌సంగానికి అడ్డుప‌డుతున్న ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావుల‌ను సస్పెండ్ స‌భ నుంచి స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స‌స్పెండ్ చేశారు. శాస‌న‌స‌భ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఈ ముగ్గురిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు.

బ‌డ్జెట్ ప్ర‌సంగంలోని ముఖ్యాంశాలు

- రూ.2.56ల‌క్ష‌ల కోట్ల‌తో బ‌డ్జెట్‌

- రెవెన్యూ వ్య‌యం రూ.1.89 ల‌క్ష‌ల కోట్లు

- క్యాపిట‌ల్ వ్య‌యం రూ.29,728 కోట్లు

- దళితబంధు 17,700 కోట్లు

- ప‌ల్లె ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌కు రూ.330కోట్లు

- ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌కు రూ.1,394 కోట్లు

- కొత్త వైద్య క‌ళాశాల‌కు రూ.1000 కోట్లు

- అట‌వీ విశ్వ‌విద్యాల‌యానికి రూ.100 కోట్లు

- రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ

- వ‌చ్చే ఆర్థిక ఏడాది రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ

- నీటి పారుదల రంగానికి రూ.22,675 కోట్లు

- ఆసరా పింఛన్ల పథకానికి రూ.11,728 కోట్లు

- కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రూ.2,750 కోట్లు

- డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు

- రోడ్లు, భవనాల కోసం రూ.1,542 కోట్లు

- ఫారెస్ట్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు

- బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ.177 కోట్లు

- బీసీ సంక్షేమం కోసం రూ.5,698 కోట్లు

ఎస్టీల సంక్షేమం కోసం 12,565 కోట్లు

Next Story