అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం.. 12కు వాయిదా

Telangana Assembly Adjourned to September 12.తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స‌మావేశాలు మంగ‌ళ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Sept 2022 7:21 AM
అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం.. 12కు వాయిదా

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స‌మావేశాలు మంగ‌ళ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. స‌మావేశాలు ప్రారంభం కాగానే ఇటీవ‌ల మ‌ర‌ణించిన తుంగ‌తుర్తి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ‌పోరాట యోధురాలు మ‌ల్లు స్వ‌రాజ్యం, క‌మ‌లాపూర్ మాజీ ఎమ్మెల్యే ప‌రిపాటి జ‌నార్థ‌న్ రెడ్డిల‌కు స‌భ సంతాపం తెలిపింది.

స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేటలోని తుంగతుర్తి నియోజకవర్గ మాజీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతోంద‌న్నారు.'తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం 1978-1983, 1983-84 వరకు తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. 1945 నుంచి 48 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. 2022 మార్చి 19న 90 సంవత్సరాల వయసులో మరణించారని' అన్నారు.

'కరీంనగర్‌ జిల్లాలోని కమలాపూర్‌ నియోజకవర్గం మాజీ సభ్యుడు పరిపాటి జనార్దన్‌రెడ్డి మృతి పట్ల సభ తీవ్ర సంతాపం తెలుపుతుంది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియ‌జేస్తోంది. జనార్దన్‌రెడ్డి 1972-78, 1978-1983 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. జమ్మికుంటలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డారు. 2022 మార్చి 28న 87 సంవత్సరాల వయసులో మరణించారు' అని స్పీక‌ర్ తెలిపారు.

అనంత‌రం స‌భ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆ త‌రువాత స‌భ‌ను 12వ తేదీ సోమ‌వారానికి వాయిదా వేశారు. కాగా.. ఈ సమావేశాల్లో పుర‌పాల‌క చ‌ట్ట‌స‌వ‌ర‌ణ స‌హా ఆరు బిల్లుల‌ను ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌నుంది.

Next Story