Telangana: రాష్ట్రంలో మరో రెండు కొత్త మెడికల్ కాలేజీలు.. అనుమతించిన ఎన్‌ఎంసీ
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విద్యను బలోపేతం చేయడంలో తెలంగాణకు మరో ప్రధాన మైలురాయిగా
By అంజి Published on 9 April 2023 2:15 AM GMTTelangana: రాష్ట్రంలో మరో రెండు కొత్త మెడికల్ కాలేజీలు.. అనుమతించిన ఎన్‌ఎంసీ
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విద్యను బలోపేతం చేయడంలో తెలంగాణకు మరో ప్రధాన మైలురాయిగా , 2023-24 విద్యా సంవత్సరానికి గాను కామారెడ్డి , కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో రెండు కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసి) శనివారం అనుమతినిచ్చింది. దేశంలో వైద్య విద్యకు రెగ్యులేటరీ అథారిటీ అయిన ఎన్‌ఎంసి.. కామారెడ్డి, కొమరం భీమ్ ఆసిఫాబాద్‌లలో 100 ఎంబీబీఎస్ సీట్ల మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చింది.
మొత్తంమీద తెలంగాణ ప్రభుత్వం రాబోయే 2023-24 విద్యా సంవత్సరానికి తొమ్మిది మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేస్తోంది. వీటిలో శనివారం రెండింటికి ఎన్‌ఎంసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగిలిన ఏడు మెడికల్ కాలేజీలు రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, నిర్మల్‌లో రానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టి హరీశ్ రావు శనివారం మాట్లాడుతూ.. ''ఆరోగ్య తెలంగాణలో భాగంంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మరింత బలోపేతం అవుతాయి. తెలంగాణలో కామారెడ్డి, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లోని మరో రెండు మెడికల్ కాలేజీలకు ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున అనుమతి లభించింది. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఉండాలనే ముఖ్యమంత్రి ఆశయ సాధన దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. తెలంగాణలో అనుమతి కోసం మరో ఏడు మెడికల్ కాలేజీలు వివిధ స్థాయిల్లో ఉన్నాయి'' అని పేర్కొన్నారు.