ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రూ. 500 చొప్పున ఎల్‌పిజి డొమెస్టిక్ సిలిండర్‌ను అందించడానికి మహాలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది.. దీని ద్వారా 42,90,246 మంది లబ్ధిదారులు (ఆగస్టు 24 వరకు) లబ్ధి పొందారని హైదరాబాద్‌కు చెందిన కార్యకర్త కరీం అన్సారీ దాఖలు చేసిన ఆర్‌టిఐ అభ్యర్థన వెల్లడించింది.
గత ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వాగ్దానం చేసిన 'ఆరు హామీ'లలో ఈ పథకం ఒకటి. ఫిబ్రవరి 27న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దీన్ని ప్రారంభించారు. డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ రీఫిల్లింగ్ స్కీమ్ కోసం వెయిటింగ్ లిస్ట్ లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ప్రజాపాలన సమయంలో సమర్పించిన దరఖాస్తుల ద్వారా వారి అర్హతకు లోబడి వచ్చిన దరఖాస్తులను ధృవీకరించి ఆమోదించారు. సబ్సిడీని ఆయా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
పథకం పురోగతిని వివరిస్తూ.. పథకం ప్రారంభించే సమయంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.80 కోట్లు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.723.33 కోట్లు మంజూరు చేయగా, రూ.241.10 కోట్లు మహాలక్ష్మి పథకం కింద ఓటు ఆన్ అకౌంట్‌లో విడుదల చేశారు. 42,90,246 మంది లబ్ధిదారుల్లో అత్యధికంగా 3,84,518 మంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలో ఉన్నారు.
అదేవిధంగా నల్గొండ జిల్లాలో 2,34,997 మంది లబ్ధిదారులు ఉండగా, ఖమ్మంలో 2,29,037 మంది లబ్ధిదారులు, నిజామాబాద్ జిల్లాల్లో 2,19,336 మంది లబ్ధిదారులు ఉన్నారు. నారాయణపేటలో అత్యల్పంగా 58,679 మంది లబ్ధిదారులు ఉన్నారు.