టెన్షన్‌లో 30 మంది ఎమ్మెల్యేలు.. ఆగస్టులోనే తేలనున్న భవితవ్యం
30 మందికి పైగా ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 9:08 AM GMTటెన్షన్‌లో 30 మంది ఎమ్మెల్యేలు.. ఆగస్టులోనే తేలనున్న భవితవ్యం
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇటీవల కొత్తగూడెం ఎమ్మెల్యేపై అనర్హత వేటు రాజకీయాల్లో అలజడి సృష్టిస్తోంది. ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం కొందరు ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తుంది. 30 మందికి పైగా ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. తమపై దాఖలైన పిటిషన్‌కు ఎలాంటి తీర్పు వస్తుందో అని భయపడిపోతున్నారు. మరోవైపు ఆగస్టు చివరిలోపు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల పిటిషన్లపై జడ్జిమెంట్ ఇవ్వాలన్ని సుప్రీంకోర్టు ఆదేశాలతో.. ఆయా నాయకులు టెన్షన్ పడుతున్నారు.
ఎన్నికల సమయంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఎన్నికల తర్వాతే పిటిషన్ దాఖలు అయ్యింది. దానిపై విచారించిన తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వనమా తప్పుడు పత్రాలు సమర్పించారని నిర్ధారంచిన కోర్టు.. ఆయన ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. వనమా వెంకటేశ్వరరావు తర్వాతి స్థానంలో ఉన్న జలగం వెంకట్రావుని ఎమ్మెల్యేగా ప్రకటించింది. అయితే.. ఇన్నాళ్లు ఎమ్మెల్యేగా కూడా ఆయన ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. కాగా.. ప్రస్తుతం ఇలాంటి పిటిషన్లే దాదాపు 30 మంది ఎమ్మెల్యేలపై హైకోర్టులో దాఖలు అయ్యాయి. దాంతో.. తమ ఎన్నికపై నమోదు అయ్యిన పిటిషన్‌పై కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు. అయితే.. 30 మంది ఎమ్మెల్యేల్లో 25 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో ఆ పార్టీ నాయకుల్లో కూడా టెన్షన్ మొదలయ్యింది.
తాజాగా హైకోర్టులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై ఎలక్షన్ కమిషన్‌లో ట్రైల్ ప్రారంభమైంది. ఎన్నికల సమయంలో ఎలక్షన్ అఫిడవిట్ ట్యాంపర్ చేశారని శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై రాఘవేందర్ రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు హైకోర్టు విచారణ కొనసాగించింది. ఈ విధంగా హైకోర్టులో ఒక్కొక్క ఎమ్మెల్యే పై ఎలక్షన్ పిటిషన్లు విచారణ జరుగుతుండటంతో నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఆగస్టు నెల చివర ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ పిటీషన్లపై జడ్జిమెంట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో నేతలంతా టెన్షన్ పడుతున్నారు.
తెలంగాణ హైకోర్టులో ఇలా 30 మంది ఎమ్మెల్యేలపై పిటిషన్లు దాఖలు అయ్యాయి. విచారణ పెండింగ్లో ఉన్న నియోజకవర్గాల వివరాలు చూస్తే.. మంచిర్యాల, హుస్నాబాద్, గద్వాల్, మహబూబ్‌నగర్, దేవరకొండ, అసిఫాబాద్, పటాన్‌చెరు, ఖైరతాబాద్, వేములవాడ, సికింద్రాబాద్, కొడంగల్, ఇబ్రహీంపట్నం, మహబూబ్‌నగర్, వరంగల్ ఈస్ట్, ఆలేరు, జూబ్లీహిల్స్, మల్కాజ్‌గిరి, కరీంనగర్, ధర్మపురి, కోదాడ, నాగర్‌కర్నూలు, గోషామహల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, గజ్వేల్, పరిగి, జనగాం, కరీంనగర్, నాంపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో 2018లో ఎమ్మెల్యేల ఎన్నికకు వ్యతిరేకంగా పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి.
అయితే... అన్ని పిటిషన్లను విచారించి ఆగస్టులోనే తీర్పు వెల్లడించాలని హైకోర్టుకు అత్యున్నత న్యాయస్థానం నుంచి ఆదేశాలు వచ్చాయి. దాంతో ఆగస్టు 12 నుంచి 15వ తేదీ వరకు పూర్తి ఎగ్జామినేషన్ చేసి తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు పేర్కొంది. విచారణను ఎదుర్కొంటున్న వారిలో మంత్రులు కూడా ఉన్నారు. శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఎక్కువ ఉన్నారు. ఈ క్రమంలో తీర్పు ఎలా ఉంటుందో అన్న భయం నెలకొంది. ఒక వేళ వ్యతిరేకంగా తీర్పు ఉంటే మాత్రం అధికార పార్టీకి ఈ ఎన్నికల్లో మైనస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.