రైతు బీమా తరహాలో నేతన్న బీమా పథకం.. ఆగస్టు 7న ప్రారంభం: కేటీఆర్
Telanagana Govt insurance scheme for weavers launches on 7th august. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో
By అంజి
తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్‌టైమ్ రాష్ట్రంలో నేత కార్మికులకు బీమా పథకాన్ఇన ప్రవేశపెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకం అమలు ఉంటుందని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 80 వేల మంది నేత కార్మికులకు లబ్ది చేకూరుతుందన్నారు. 60 ఏళ్లలోపు ఉన్న ప్రతి నేత కార్మికుడు ఈ పథకానికి అర్హుడని తెలిపారు. దురదృష్టవశాత్తు నేత కార్మికుడు మరణిస్తే రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుందని తెలిపారు. నేతన్న సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే బీమా పథకాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు. ఈ నెల 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం రోజున ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తామని ప్రకటించారు. బీమా కాలంలో లబ్దిదారులైన చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నామినీకి ఐదు లక్షల రూపాయలను అందచేస్తామన్నారు. లబ్దిదారులు మృతి చెందిన 10 రోజుల్లో ఈ మొత్త బ్యాంక్ ఖాతాలో జమవుతుందని తెలిపారు. నేత కార్మికుల ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఈ పథకం అమలుకు చేనేత, జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉండనుంది.
ఈ పథకం కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర సర్కార్ ఒప్పందం చేసుకుందన్నారు. వార్షిక ప్రీమియం కోసం నేతన్నలు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వమే బీమా ప్రీమియం మొత్తాన్ని ఎల్‌ఐసీకి చెల్లిస్తుందన్నారు. ఇందుకోసం రూ.50 కోట్లు కేటాయించామని, ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామని తెలిపారు. చేనేత, జౌళి రంగానికి చరిత్రలో ఏ ప్రభుత్వము కేటాయించని విధంగా 2016-2017 నుండి ప్రతి సంవత్సరం ప్రత్యేక బడ్జెట్ బీసీ వెల్ఫేర్ నిధుల నుండి ఏటా రూ. 1200.00 కోట్ల చొప్పున కేటాయిస్తున్నామన్నారు.