రేపటి నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ

Teachers transfers process to begin from tomorrow. తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ

By అంజి  Published on  26 Jan 2023 5:12 PM IST
రేపటి నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం జీఓ నెం.5ను జారీ చేశారు. బదిలీలు మరియు పదోన్నతులు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా మాన్యువల్‌గా జరుగుతాయి. కేటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందేందుకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాలను రేపు ఆన్‌లైన్‌లో ప్రకటించి 28 నుంచి 30వ తేదీ వరకు బదిలీల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు.

హైస్కూల్ ఉపాధ్యాయుల దరఖాస్తుల హార్డ్ కాపీలను సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, ప్రభుత్వ ప్రాథమిక, మాధ్యమిక ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈఓలకు, మండల పరిషత్ ప్రాథమిక, మాధ్యమిక ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు సమర్పించాలి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2లోపు ఈ ప్రక్రియ ముగియాల్సి ఉంటుంది. మార్చి 5 నుంచి 19వ తేదీ వరకు అప్పీళ్లకు ఛాన్స్‌ కలిస్తారు. దరఖాస్తులు అందిన 15 రోజుల్లోనే అప్పీళ్లను పరిష్కరిస్తారు.

ఇటీవలే టీచర్ల బదిలీలు, పదోన్నతులపై ఎడ్యుకేషన్‌ మినిస్టర్‌ సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్ష చేశారు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, బదిలీలు, పదోన్నతుల పూర్తి షెడ్యూల్‌ వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ముందు గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల బదిలీలు, అనంతరం హెచ్‌ఎం ఖాళీలను స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఆ తర్వాత సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు పదోన్నతులు ఇచ్చి స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీలను భర్తీ చేస్తారు. తెలంగాణలో చివరిసారిగా 2018లో టీచర్ల బదిలీ ప్రక్రియ చేపట్టారు.

Next Story