తెలంగాణలో తాజాగా రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగగా.. ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. పట్టభద్రులు మాత్రమే ఈ ఎన్నికల్లో.. ఓటు నమోదు చేసుకుని.. ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మున్సిపల్ చైర్‌పర్సన్ దొంగ ఓటు వేసినట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. తోటికోడలు పేరుతో నమోదైన ఓటును తన ఓటుగా తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ తాటికొండ స్వప్న వేశారు.
ఈ నెల 14 మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఓటరు ఇంటి పేరు స్వప్న ఇంటి పేరు ఒకటే కావడంతో ఆమె ఎవరికి అనుమానం రాకుండా ఓటు వేశారనే ప్రచారం జరుగుతోంది. తోటికోడలు పేరుతో స్వప్న ఓటు వినియోగించుకున్నారనే అభియోగంతో కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన కలెక్టర్.. ఆమె దొంగ ఓటు వేసినట్లు తేల్చారు.
ప్రజలకు నీతీ నియమాల గురించి చెప్పే నాయకులు ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలకు ఏం ముఖం చూపిస్తారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై పెద్ద దుమారమే రేగుతోంది.. దొంగ ఓటు వేసిన మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న రాజీనామా చేయాలంటూ మున్సిపల్ కార్యాలయం ముందు కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణ జన సమితి కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు.