తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నది. హైదరాబాద్ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా, దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయానికి స్వస్తిపలుకుతూ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను మహిళలకే కట్టబెట్టింది. బల్దియా పగ్గాలను సీఎం కేసీఆర్ మహిళామణుల చేతికి అప్పగించడంతో అతివల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. కాగా, దీనిపై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. బల్దియా మేయర్ ఎన్నికపై బిజేపి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టిఆర్ఎస్-ఎంఐఎంల పొత్తుతో ఈ తతంగం నడిచిందని అంటున్నారు.
తాజాగా దీనిపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. బల్దియా మేయర్ ఎన్నికపై బిజేపి వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్పుబట్టారు. టిఆర్ఎస్-ఎంఐఎంల మధ్య పొత్తు ఉంటే మజ్లిస్కు డిప్యూటీ మేయర్ ఇవ్వాలి కదా అని ఎదురు ప్రశ్నించారు. ఒక పార్టీకి ఓటు వేయలేని సభ్యులు.. ఇతరులకు మద్దతు ఇవ్వడం ఎక్కడైనా జరిగేదే అన్నారు.
ఒకేసారి రెండు పదవులూ మహిళలకే దక్కడం హర్షణీయమన్న మంత్రి.. పడతికి పట్టం కడితే అభినందించకుండా విమర్శిస్తారా అని మండిపడ్డారు. వెనకబడిన వర్గాల వారిని అన్ని రకాలుగా తెరాస ప్రోత్సహిస్తోందని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో భాజపా అనైతికంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేదా అని ప్రశ్నించారు. పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజేపి కలిసిపోలేదా అని అడిగారు.
దేశంలో హిందువులు అంటే భాజపా నేతలు మాత్రమే కాదని మంత్రి తలసాని అన్నారు. బిజేపి నేతలు తాత్కాలిక లాభం కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవారిని గౌరవించే సంస్కారం లేదని మండిపడ్డారు.