కేసీఆర్‌ సభకు అనుమతిపై ఉత్కంఠ!

నల్గొండలో ఈ నెల 13న మాజీ సీఎం కేసీఆర్‌ సభకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే కేసీఆర్‌ సభకు అనుమతిపై ఉత్కంఠ నెలకొంది.

By అంజి  Published on  7 Feb 2024 5:30 AM GMT
KCR meeting, Nalgonda, Telangana, KRMB

కేసీఆర్‌ సభకు అనుమతిపై ఉత్కంఠ!

నల్గొండలో ఈ నెల 13న మాజీ సీఎం కేసీఆర్‌ సభకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే కేసీఆర్‌ సభకు అనుమతిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే నెల రోజుల పాటు ఎలాంటి బహిరంగ సభలకు వీలు లేదని, 30, 30ఏ యాక్ట్‌ అమలుచేస్తున్నట్టు ఇప్పటికే జిల్లా ఎస్పీ ప్రకటన చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలకు పోలీసులు నో అంటున్నారు. అయితే కేసీఆర్‌ సభ ఉందనే పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ అంటోంది.

మరోవైపు బీఆర్ఎస్ సభకు దీటుగా కాంగ్రెస్ పార్టీ భారీ సభకు ప్లాన్‌ చేస్తోంది. కృష్ణా జలాలపై 13న నల్లగొండ జిల్లాలో కేసీఆర్ సభ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. 3 లక్షల మందితో సభను నిర్వహించాలని గులాబీ నేతలు టార్గెట్ పెట్టుకున్నారు. కేసీఆర్ సభకు దీటుగా 2లక్షల మందితో నల్లగొండలో కాంగ్రెస్ సభకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని మంత్రి కోమటిరెడ్డి ప్లాన్ వేసినట్టు సమాచారం. ఇదే సభలో ప్రియాంకతో మరో రెండు గ్యారంటీల అమలుకు యోచిస్తున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ కు చెక్ పెట్టేలా మంత్రి కోమటిరెడ్డి వ్యూహ రచన చేస్తున్నారు.

ఇటీవల కాంగ్రెస్‌ చేతిలో అధికారం కోల్పోయి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మంగళవారం కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్‌ వ్యూహరచన చేశారు.

సాగునీటి ప్రాజెక్టులపై భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణా బేసిన్‌లోని బీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఫిబ్రవరి 13న నల్గొండలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించారు. మూడు నెలల తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్‌కు వచ్చిన ఆయనకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు.

కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుల నిర్వహణను అప్పగించాలని కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుందని బీఆర్‌ఎస్ చీఫ్ పార్టీ నేతలకు చెప్పారు. రిజర్వాయర్ల నిర్వహణకు కూడా కేఆర్‌ఎంబీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ పోరాటం బీఆర్‌ఎస్‌కు కొత్త కాదని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని పార్టీ నేతలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన అనాలోచిత వైఖరితో సాగునీరు, తాగునీటిపై రాష్ట్ర హక్కులను హరిస్తోందని బీఆర్‌ఎస్ చీఫ్ ఆరోపించారు.

Next Story