సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సూర్యాపేట - ఖమ్మం హైవేపై CG 17KS7719 నంబర్ గల ప్రైవేట్ గుప్తా ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఉదయం 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అతి వేగంతో ఢీకొనడంతో బస్సు నుజ్జు నుజ్జు అయ్యింది.
ఈ ఘటనలో 17 మంది కూలీలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కూలీలు పనుల కోసం ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. టైర్ పేలి పక్కకు ఆగివున్న ఇసుక లారీని బస్సు ఢీ కొట్టినట్టుగా సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.