సూర్యాపేట జిల్లాలో రోడ్డుప్రమాదం, ముగ్గురు మృతి
సూర్యాపేట జిల్లాలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.
By Srikanth Gundamalla Published on 28 Feb 2024 10:50 AM ISTసూర్యాపేట జిల్లాలో రోడ్డుప్రమాదం, ముగ్గురు మృతి
సూర్యాపేట జిల్లాలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మోతె మండలం కేశవపురం దగ్గర కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మునగాల మండలం రామసముద్రానికి చెందిన 15 మంది కూలీలు ఆటోలో కూలీ పనుల కోసం బయల్దేరారు. మోతె మండలం బురకచెర్ల గ్రామానికి మిరపకోత పనుల కోసం వెళ్తున్నారు. వ్యవసాయ కూలీలు ఎక్కిన ఆటో సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారి అండర్‌పాస్ వద్దకు రాగానే ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే ముగ్గురు కూలీలు చనిపోయారు. ఇక మరో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో.. వారు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సూర్యాపేట ప్రాంతీయ ఆస్పత్రిలో ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇక ఈ ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు మధిర డిపోకు చెందినదిగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించామనీ.. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు వైద్యులు.