సూర్యాపేటలో దళితబంధు అర్హుల ఆగ్రహం.. మంత్రి జగదీశ్ రెడ్డి ఫోటోలు ధ్వంసం..!

సూర్యపేట జిల్లా నెమ్మికల్‌లో దళితబంధు అనర్హులకు కేటాయించారటూ ఆందోళనకు దిగారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2023 2:00 PM GMT
suryapet,  nemmikal village, protested,  dalit bandhu,

సూర్యాపేటలో దళితబంధు అర్హుల ఆగ్రహం.. మంత్రి జగదీశ్ రెడ్డి ఫోటోలు ధ్వంసం..!

దళిత బంధు అనర్హులకే ఇచ్చారని సూర్యాపేట జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న అర్హులు ఆగ్రహంతో ఒక్కసారిగా ఊగిపోయారు. ఎందుకిలా జరిగిందని ఆ గ్రామ సర్పంచ్ ని అడగడానికి వెళ్లిన దళితులపై సర్పంచ్ కుమారుడు దుర్భాషలాడుతూ.. చేయి చేసుకోవడంతో రగిలిపోయిన దళితులు సర్పంచి ఇంటిపై దాడి చేశారు. దీనంతటికి కారణం మంత్రి జగదీష్ రెడ్డి అనే భావించిన దళితులు ఆయన బొమ్మతో ఉన్న గోడ గడియారాన్ని నేలకేసి కొట్టి కాళ్లతో తొక్కారు. అక్కడి నుంచి నేరుగా సూర్యాపేట- దంతాలపల్లి రహదారిపై దళితులు ధర్నా చేశారు.

తాజాగా జరిగిన ఈ ఘటన జిల్లాలోని ఆత్మకూర్ మండలం నెమ్మికల్ గ్రామ దళితవాడలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నెమ్మికల్ గ్రామ సర్పంచ్ గంపల సతీష్, ఉప సర్పంచ్ రేణికుంట్ల ఉపేందర్, వార్డు సభ్యులు తన అనుచరులు, బంధువులకే దళిత బందు ఇచ్చారని ఆరోపణలు చేశారు. గ్రామానికి వచ్చిన దళిత బంధు 24 యూనిట్లుగా కేటాయించారు.

ఇందులో మాదిగలకు 12, మాలలకు 12 యూనిట్లుగా పంచుకున్నారు. ఈ దళిత బందు యూనిట్‌లని అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, భూములు కలిగి ఉండి, ఆర్థికంగా బలపడిన వారికే స్థానిక నాయకులు అందించారని మండిపడ్డారు. అంతకు ముందు ఈ కేటాయింపులో ఏం జరిగిందని గ్రామ సర్పంచ్ సతీష్‌ని అడగడానికి ఆయన ఇంటికి వెళ్లిన కొందరు దళితులను సర్పంచ్ తనయుడు నరేందర్ దుర్భాషలాడుతూ గంప విజయ రావు అనే వ్యక్తిపై దాడి చేశారు. దీంతో ఆగ్రహించిన దళితులు సర్పంచ్ ఇంటిపై దాడి చేశారు.

అనంతరం దళిత వాడలోని ఇళ్లల్లో ఉన్న మంత్రి ఫొటో కలిగిన గోడ గడియారాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చి చెప్పులతో కొట్టి కిందేసి తొక్కారు. అంతటితో ఆగక సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్వర్ రెడ్డిలు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని శాంతింప చేసే ప్రయత్నం చేయగా, తాము దళిత బందుకు పూర్తిగా అర్హులమని, తమకు న్యాయం చేయాలని అక్కడికి వచ్చిన ఆత్మకూర్ ఎస్సై వెంకట్ రెడ్డి కాళ్లపై పడి వేడుకున్నారు.

Next Story