రేషన్ కార్డుల పునరుద్ధరణకు సర్వే.. అర్హులకు ఊరట
Survey for renewal of ration cards in Telangana. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల్లో గల్లంతైన అర్హులను గుర్తించి తిరిగి మంజూరు చేసేందుకు
By అంజి Published on 18 July 2022 11:09 AM ISTతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల్లో గల్లంతైన అర్హులను గుర్తించి తిరిగి మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 6 ఏళ్ల క్రితం తెలంగాణలో కొన్ని రేషన్ కార్డులను రద్దు చేశారు. వాటిలో అర్హులను గుర్తించి, వారికి రేషన్ కార్డులను మంజూరు చేయనున్నారు. ఇందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి సర్వే ప్రారంభం కానుంది. తొలగించిన కార్డుల్లోని చిరునామా ఆధారంగా అధికారులు పట్టణాలు, గ్రామాల్లో సర్వే నిర్వహించనున్నారు. రద్దైన రేషన్‌కార్డు దారుల ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి వారు తెల్ల రేషన్ కార్డుకు అర్హులా..? కాదా..? అని తేల్చనున్నారు.
క్షేత్రస్తాయి సర్వే కోసం ఆర్‌ఐలను ఫీల్డ్ అధికారులుగా నియమించారు. ''తొలగించిన కార్డు దారుల వివరాలను ప్రతి రేషన్ దుకాణం వద్ద ప్రదర్శిస్తాం. ఆ జాబితా ఆధారంగా వారు కార్డు పునరుద్దరణకు దరఖాస్తు చేసుకోవచ్చు'' అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
వాస్తవానికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. అయితే ఆదాయం తక్కువగా చూపారని, కారు, ఇతర విలాస వంతమైన జీవితం గడుపుతున్నారన్న కారణాలతో 2016లో కొన్ని రేషన్ కార్డులను రద్దు చేశారు. సర్వేలో అనర్హులను అర్హులుగా గుర్తిస్తే ఫీల్డ్ ఆఫీసర్లను బాధ్యులను చేసి వారిపై చర్యలు తీసుకోనున్నారు.
రద్దైన కార్డుదారుల పునరుద్ధణకు మరో సారి సర్వే నిర్వహించి అర్హులకు ఇవ్వాలని పౌరసరఫరాల కమిషన్ కార్యాలయ ఆదేశాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా యంత్రాంగం పున:పరిశీలన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 277 రేషన్ దుకాణాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 277 రేషన్ దుకాణాలు ఉన్నాయి. అందులో 1.24 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కరోనా నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా 10 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆరేళ్ల కిందట వివిధ కారణాలతో జిల్లా వ్యాప్తంగా 3094 కార్డులను తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆదేశాలతో తొలగించిన కార్డులను మళ్లీ సర్వే నిర్వహించి అర్హులుగా తేలితే వారికి రేషన్ ఇవ్వనున్నారు.
తెల్ల రేషన్ కార్డుతో..
తెల్లరేషన్ కార్డులు కేవలం రేషన్ దుకాణంలో సరకులు తీసుకునేందుకు మాత్రమే కాదు.. ఆరోగ్యశ్రీ, ఆసరా పింఛను, రెండు పడక గదుల ఇళ్లు మంజూరు, విద్యార్థులకు స్కాలర్‌షిప్, కాలేజీలు, స్కూళ్లలో ప్రవేశాలు తదితర సంక్షేమ పథకాలు పొందడానికి వీలుంటుంది. కార్డులు లేకుంటే దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారుగా భావించి పథకాలకు అనర్హులుగా గుర్తిస్తున్నారు. దీంతో అర్హత ఉండి రేషన్‌కార్డులు లేనివారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాస్త ఆలస్యంగా..
''తొలగించిన కార్డులలో అర్హులను గుర్తించే సర్వే జిల్లాలో కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది. ఈనెల 20లోపు సర్వే పూర్తి చేసి నివేదికను రాష్ట్ర కార్యాలయానికి పంపించాలి. కానీ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. వారందరినీ పునరావస కేంద్రాల్లో చేర్చడం, వారికి కావాల్సి సౌకర్యాలు కల్పించడం, నష్ట నివారణ అంచనా వేయడం తదితర పనులు ఉన్నాయి. సర్వే కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.'' అని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చెప్పారు.