తెలంగాణలో మండుతోన్న ఎండలు..ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
వేసవి ఆరంభంలోనే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.
By Knakam Karthik
తెలంగాణలో మండుతోన్న ఎండలు..ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
వేసవి ఆరంభంలోనే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసారు. ఉగాది అయినా దాటకముందే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉత్తర తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. ప్రధానంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో తీవ్రమైన ఎండలతోపాటు వడగాలులు కూడా వీస్తాయని అన్నారు.
కాగా మార్చ్ 19 వరకు రాష్ట్రంలో ఈ హీట్ వేవ్ కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రానున్న రెండురోజులపాటు రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ విడుదల చేశారు. అత్యవసరం అయితే తప్ప పగటిపూట బయటికి రావొద్దని హెచ్చరించారు. రాజధాని హైదరాబాద్ లో కూడా 39-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇదే ఎండ తీవ్రత ఉన్నట్టు భారత వాతావరణశాఖ వెల్లడించింది.
తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీచేసిన జిల్లాలివే :
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్,ఖమ్మం, గద్వాల, నారాయణపేట్, భద్రాద్రి కొత్తగూడెం,ములుగు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. మిగతా జిల్లాల్లో కూడా ఎండలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ శాఖ పేర్కోంది.
తెలంగాణలో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం ఉంది. మధ్యాహ్నం ఎండలు మండిపోతూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... ఇక రాత్రులు, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే రాత్రులు చలికాలంలో మాదిరిగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.