తెలంగాణలో ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయడం లేదా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నగరంలోని జేఎన్టీయూహెచ్, ఉస్మానియా యూనివర్సీటీల విద్యార్థులు సోమవారం ఉదయం ర్యాలీగా బయలుదేరి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని ముట్టడించారు. విద్యార్థులంతా 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉంటారని అందరూ పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకోని నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. ఈ క్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలపై నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
విద్యార్థులు ఎక్కడ కోరితే అక్కడ పరీక్షా కేంద్రాలు ఉండేలా అవకాశం కల్పిస్తామని చెప్పారు. పరీక్షల వాయిదాపై ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోలేమన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం.. లక్షలాది మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. స్పష్టమైన వైఖరి చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేయడంతో పాటు మంత్రి నివాసానికి సమీపంలోని రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు విద్యార్థులకు సర్థిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.