ప్రభుత్వ బడిలో కలకలం.. ఆ చాకెట్లు తిని వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజవర్గం కొత్తూరు మండలంలో గంజాయి చాక్లెట్ల విక్రయం కలకలం రేపింది.
By అంజి Published on 10 Jan 2024 2:30 PM IST
ప్రభుత్వ బడిలో కలకలం.. ఆ చాకెట్లు తిని వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజవర్గం కొత్తూరు మండలంలో గంజాయి చాక్లెట్ల విక్రయం కలకలం రేపింది. కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంగోర్ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారికి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా పెట్టిన ఎస్ఓటి పోలిసులు కొత్తూరులోని కిరాణా షాపుల్లో, డబ్బాలలో పూర్తి సమాచారం మేరకు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో చార్మినార్ గోల్డ్ పేరిట పసుపు, బంగారు వర్ణంలో గల సుమారు 8 కేజీల గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు పట్టుపడ్డాయి. చాక్లెట్లను విక్రయిస్తున్న ఒడిశా రాష్టానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. గంజాయి చాక్లెట్ల విక్రయ వ్యవహారంలో కొత్తూరు ఇన్స్పెక్టర్ నర్సింహా రావును వివరణ కోరగా.. గంజాయి చాక్లెట్ల వ్యవహారం నిజమేనని, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు, కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
కొత్తూరు మండలంలో విచ్చలవిడిగా వెలిసిన పాన్ షాపులు పాన్ షాప్ లపై చర్యలు తీసుకోవాలని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డిని కలిసి కొత్తూరు మున్సిపాలిటీ చైర్మన్ దేవేందర్ యాదవ్ ఫిర్యాదు చేశారు. పాన్ షాప్ లలో విచ్చలవిడిగా మత్తుపదార్థాలు అమ్ముతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎస్‌వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. పాన్ షాప్ లపై విస్తృత తనిఖీలు చేపట్టగా.. తనిఖీల్లో మత్తు చాక్లెట్లు లభ్యమయ్యాయి. పాన్‌షాపుల్లో స్థానిక పాఠశాలలతో పాటు ప్రజలకు విచ్చలవిడిగా మత్తు చాక్లెట్లను విక్రయిస్తున్నారు అంటూ మున్సిపాలిటీ చైర్మన్ దేవేందర్ యాదవ్ ఆరోపించారు.