ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు: సజ్జనార్

తెలంగాణలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం.. 'మహాలక్ష్మీ' పథకం పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది.

By అంజి  Published on  28 Dec 2023 12:29 PM IST
RTC staff, Sajjanar, TSRTC, Telangana

ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు: సజ్జనార్

తెలంగాణలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం.. 'మహాలక్ష్మీ' పథకం పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. దీంతో కొందరు ప్రయాణికులు ఫుట్‌బోర్డుపై నిల్చొని ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ప్రయాణికులకు పలు జాగ్రత్తలు చెప్పిన మహిళా కండక్టర్‌ను కొందరు మహిళలు దూషించారు. అంతటితో ఆగకుండా ఆమెను బస్సు నుండి దించేశారు. దీంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనను ఆర్టీసీ సీరియస్‌గా తీసుకుంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.. ఈ ఘటనపై స్పందిస్తూ ప్రయాణికులకు వార్నింగ్‌ ఇచ్చారు.

''టీఆర్‌ఎస్‌ఆర్టీసీకి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్‌ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లైనా సిబ్బందిని కొందరు దూషించడం, దాడులు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మా అధికారులు ఈ ఘటనలపై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి.. విచారణ చేపట్టారు'' అని సజ్జనార్ పేర్కొన్నారు.

''ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించి.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతున్నాం'' అని సజ్జనార్ అన్నారు.

Next Story