మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం: సీఎం రేవంత్‌

మూడేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 19, శుక్రవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆదేశించారు.

By అంజి  Published on  19 July 2024 11:13 AM GMT
Telangana,  govt schools, CM Revanth

మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం: సీఎం రేవంత్‌

హైదరాబాద్: మూడేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 19, శుక్రవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆదేశించారు. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లను కూడా ప్రారంభించేందుకు నిర్మాణాత్మక ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ఈ మార్పులు జరగనున్నాయి.

ప్లే స్కూల్‌ తరహాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడో తరగతి వరకు విద్యనందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని శుక్రవారం రేవంత్‌రెడ్డి విద్యాశాఖను కోరారు. విద్యార్థులందరికీ వారి స్వగ్రామాలలో విద్యా సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాట్లు చేయాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో అదనంగా ఒక టీచర్‌ను నియమించేందుకు ప్రణాళికను ఖరారు చేయాలని సీఎం సూచించారు.

4వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని, సెమీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ఒకటి, రెండు మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు విద్యారంగ నిపుణుల అభిప్రాయాలను సేకరించి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలంగాణ విద్యాశాఖ అధికారులను కోరారు. ప్రభుత్వ కేటాయింపులతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సీఎస్‌ఆర్‌ నిధులను కూడా వినియోగించాలని రేవంత్‌రెడ్డి.. విద్యాశాఖ అధికారులను కోరారు.

Next Story