గద్వాల్, కామారెడ్డి జిల్లాల్లోని మెట్ల బావుల పునరుద్ధరణ
హైదరాబాద్ నగరంలోని బన్సీలాల్‌పేట, ఇతర ప్రాంతాల్లోని మెట్ల బావుల పునరుద్ధరణ విజయవంతం కావడంతో.. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద
By అంజి Published on 16 May 2023 8:45 AM GMTగద్వాల్, కామారెడ్డి జిల్లాల్లోని మెట్ల బావుల పునరుద్ధరణ
హైదరాబాద్ నగరంలోని బన్సీలాల్‌పేట, ఇతర ప్రాంతాల్లోని మెట్ల బావుల పునరుద్ధరణ విజయవంతం కావడంతో.. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల సహకారంతో జోగులాంబ గద్వాల్, కామారెడ్డి జిల్లాలో ఉన్న మెట్ల బావుల పునరుద్ధరణను రెయిన్ వాటర్ ప్రాజెక్ట్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే గద్వాల్‌లోని మూడు మెట్టబావుల్లోని చెత్తను తొలగించి, పూడికతీత, నిర్మాణ పునరుద్ధరణ, సుందరీకరణతో కొత్తగా రూపుదిద్దేందుకు అధికారులు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌కు చెందిన సంరక్షకురాలు, బన్సీలాల్‌పేటలోని మెట్ల బావిని పునరుద్ధరించడంలో ఆమె కృషికి పేరుగాంచిన కల్పనా రమేష్.. పట్టణంలోని మెట్ల బావుల పునరుద్ధరణకు చొరవ తీసుకున్నారు.
రెయిన్ వాటర్ ప్రాజెక్ట్స్ వ్యవస్థాపకురాలు కల్పనా రమేష్.. మే 9న జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో గద్వాల్‌లోని మూడు మెట్ల బావుల పునరుద్ధరణ మొదటి దశ కోసం ఎంఓయూపై సంతకం చేశారు. బెంగళూరుకు చెందిన ఎన్‌జిఓ సే ట్రీస్ పునరుజ్జీవనానికి తన సపోర్ట్‌ను అందించిందని ఆమె తెలిపారు.
గద్వాల్‌లోనే కాకుండా కామారెడ్డి జిల్లాలో కూడా లింగంపేట, భిక్నూర్‌లోని రెండు హెరిటేజ్ మెట్ల బావులను బృందం గుర్తించింది. పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ లింగంపేట్ (నాగన్న బావి) స్టెప్‌వెల్ పునరుద్ధరణకు సపోర్ట్ ఇస్తోంది. హైదరాబాద్‌లోని ప్రమతి టెక్నాలజీస్‌లో అత్యున్నత కార్యనిర్వాహక స్థానాల్లో పనిచేసిన ముగ్గురు దాతలు భిక్నూర్ స్టెప్‌వెల్ పునరుద్ధరణ పనులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
కాగా, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని మెట్ల బావుల పునరుద్ధరణ, కాకతీయుల కాలంలో ఒకప్పుడు తాగునీటికి ఆధారమైన ఖమ్మం కోటలోని జాఫర్ బావి పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల, ఫలక్‌నుమా బస్ డిపో సమీపంలో మరో మెట్ల బావిని గుర్తించారు. దీని పునరుద్ధరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయి.