తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ఆసక్తికర ప్రకటన చేశారు. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు రాష్ట్రంలోనే వైద్య విద్య పూర్తిచేసుకునేలా వారికయ్యే ఖర్చును భరిస్తామని తెలిపారు. ఉక్రెయిన్ లో రష్యా దాడుల కారణంగా ఇప్పటివరకు 740 మంది తెలంగాణ విద్యార్థులను రాష్ట్రానికి తీసుకువచ్చారని కేసీఆర్ చెప్పారు. ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో తిరిగి వచ్చిన తెలంగాణ విద్యార్థులను ఆర్థికంగా ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ మంగళవారం ప్రకటించారు.
అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ లో వైద్య విద్యకు కోటి రూపాయలు ఖర్చవుతుందంటున్నారు. అదే సమయంలో ఉక్రెయిన్ లో రూ.25 లక్షలతోనే వైద్య విద్య పూర్తి చేయొచ్చని చెబుతున్నారు. భారత్ లో అధిక మొత్తాలు చెల్లించలేక ఉక్రెయిన్ వెళితే అక్కడ ప్రస్తుత పరిస్థితులేం బాగాలేవన్నారు. ఉక్రెయిన్ మళ్లీ ఎప్పటికి సాధారణ స్థితికి చేరుకుంటుందో చెప్పలేమని.. అందుకే 740 మంది తెలంగాణ విద్యార్థులు ఇక్కడే వైద్య విద్య పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
దేశవ్యాప్తంగా 20,000 మంది విద్యార్థులు మెడిసిన్ చదవడానికి ఉక్రెయిన్ వెళ్లారు. ఉక్రెయిన్‌లో చదువుతున్న తెలంగాణకు చెందిన 740 మంది వైద్య విద్యార్థుల్లో 710 మందిని ప్రభుత్వం తిరిగి తీసుకురాగలిగిందని ఆయన తెలిపారు. "ఇప్పుడు యుద్ధం కొనసాగుతోంది, వారి భవిష్యత్తు ఏమిటి? కాబట్టి, వారు ఇక్కడ విద్యను కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని నేను చెప్పాలనుకుంటున్నాను. వారు ఆగిపోకుండా లేదా వారి భవిష్యత్తును పాడు చేసుకోకుండా ఉండేందుకు మేము ఖర్చును భరిస్తాము, "అని ముఖ్యమంత్రి చెప్పారు.