భక్తులకు శుభవార్త, మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు..ధర ఎంతో తెలుసా?

తెలంగాణలో అతిపెద్ద గిరిజన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By -  Knakam Karthik
Published on : 22 Jan 2026 3:27 PM IST

Telangana, Medaram, Mahajatara, Sammakka-Saralamma Mahajatara, Helicopter services

భక్తులకు శుభవార్త, మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు..ధర ఎంతో తెలుసా?

తెలంగాణలో అతిపెద్ద గిరిజన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జాతర సమయంలో వేగంగా గమ్యస్థానం చేరుకునేందుకు వీలుగా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ పర్యాటక శాఖ, తుంబి ఎయిర్‌లైన్స్ సంయుక్తంగా అందిస్తున్న ఈ సేవలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు జనవరి 22 నుండి జనవరి 31 వరకు అందుబాటులో ఉంటాయి.

హనుమకొండ నుండి భక్తులు మేడారానికి హెలికాప్టర్‌లో చేరవచ్చు.ఆకాశం నుండి జాతర దృశ్యాలను చూసే వీలుగా హెలి రైడ్స్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. భక్తుల అవసరాలకు అనుగుణంగా రెండు రకాల ప్యాకేజీలను నిర్వాహకులు ప్రకటించారు. మొదటి ప్యాకేజీలో భాగంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం నుంచి నేరుగా మేడారం వెళ్లి, తిరిగి వచ్చేందుకు అవకాశం కల్పించారు. ఈ రౌండ్ ట్రిప్‌కు ఒక్కో వ్యక్తికి ఛార్జీ రూ. 35,999గా నిర్ణయించారు. అయితే, జనవరి 23లోపు బుక్ చేసుకున్న వారికి రాయితీ అందిస్తుండగా, వారు రూ. 30,999 చెల్లిస్తే సరిపోతుంది.

ఇక, రెండో ప్యాకేజీ కింద మేడారం జాతర అందాలను ఆకాశం నుంచి వీక్షించాలనుకునే వారి కోసం 'జాయ్ రైడ్స్' నిర్వహిస్తున్నారు. మేడారం సమీపంలోని పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి ఈ సర్వీసులు నడుస్తాయి. సుమారు 6 నుంచి 7 నిమిషాల పాటు సాగే ఈ గగన విహారానికి ఒక్కొక్కరికి రూ. 4,800 రుసుముగా వసూలు చేయనున్నారు. ఈ సేవలతో భక్తులు సమయం ఆదా చేసుకోవడంతో పాటు జాతరను విహంగ వీక్షణం చేసే అద్భుత అవకాశం పొందవచ్చు.

Next Story