మహిళా సంఘాలకు శుభవార్త..సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు 90 శాతం సబ్సిడీ
తెలంగాణలోని మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By - Knakam Karthik |
మహిళా సంఘాలకు శుభవార్త..సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు 90 శాతం సబ్సిడీ
తెలంగాణలోని మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సౌర విద్యుత్తు ఉత్పత్తి బాధ్యతలను మహిళా గ్రామ సమాఖ్యలకు అప్పగిస్తోంది. పర్యావరణ హితంగా, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అయ్యే శక్తి వనరుగా సౌర శక్తి నిలుస్తోంది. మహిళా గ్రామ సమాఖ్యలను ఎంపిక చేసి మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు.
విస్తీర్ణం ఎంత?
ప్రతి గ్రామంలో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు. స్థల ఎంపిక బాధ్యత ప్రభుత్వానిదే. కాంట్రాక్టర్ ద్వారా సామగ్రి అందించబడుతుంది. అయితే ప్లాంట్ నిర్వహణ బాధ్యత మాత్రం ఆయా గ్రామాల మహిళా సమాఖ్యలదే. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని రెండు ప్రతిపాదిత గ్రామాల్లో భూసర్వే, సాయిల్ టెస్ట్ పూర్తి చేశారు. త్వరలోనే ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఎంపికైన సమాఖ్యలో ఆసక్తి ఉన్న సభ్యులు ఎంతమందైనా చేరవచ్చు. ఒక్క ప్లాంటు స్థాపనకు మొత్తం వ్యయం రూ.2.97 కోట్లు. ఇందులో 90 శాతం రుణంగా ఇవ్వబడుతుంది. మిగిలిన 10 శాతం మహిళా సమాఖ్య పొదుపు నిధి నుంచి చెల్లించాలి. పదేళ్ల కాలపరిమితిలో రుణం తీర్చాల్సి ఉంటుంది.
లాభాలు ఎలా?
ఉత్పత్తి చేసిన విద్యుత్తు ఎన్పీడీసీఎల్‌కు విక్రయించాల్సి ఉంటుంది. ఇందుకోసం సంబంధిత సబ్‌స్టేషన్లలో మీటర్లు ఏర్పాటు చేస్తారు. ఒక్క యూనిట్‌కు రూ.3.13 చెల్లిస్తారు. రుణం చెల్లింపుదశలోనే ఏడాదికి రూ.10-20 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రుణం తీరిన తర్వాత ఈ ఆదాయం రూ.50 లక్షల వరకు పెరుగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (పీఎంఎస్‌జీఎంబీవై) ద్వారా వినియోగదారులను సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సహిస్తోంది. దేశవ్యాప్తంగా గురువారం (నవంబరు 6) నాటికి 64.85 లక్షల మంది ఈ పథకం కింద దరఖాస్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం 34,263 ఇళ్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా 68.5 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని అధికారుల అంచనా. జిల్లాలో ప్రజల నుంచి స్పందన నామమాత్రంగా ఉందని, పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు.