కాసేపట్లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్, మరోవైపు హైకోర్టులో విచారణ
రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం మరికాసేపట్లో తెరలేపనుంది
By - Knakam Karthik |
కాసేపట్లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్, మరోవైపు హైకోర్టులో విచారణ
రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం మరికాసేపట్లో తెరలేపనుంది. షెడ్యూల్ ప్రకారం యథాతథంగా ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిర్ణయించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ మొదటి విడత ఎన్నికల నోటీసులు గురువారం జారీ కానున్నాయి. ఉదయం 10:30 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ఆరంభం కానుంది. ఈ నెల 23న మొదటి విడత, 27వ తేదీన రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ నేడు కూడా కొనసాగనుండగా, ఎస్ఈసీ మాత్రం ఎన్నికల ప్రక్రియను యధావిధిగా నిర్వహించాలని నిర్ణయించింది. గత నెల 29న నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం, షెడ్యూల్ ప్రకారమే ముందుకెళ్లేందుకు సిద్ధమైంది. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత పంచాయతీ వార్డులు, సర్పంచిల ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం హైకోర్టులో విచారణ ముగిశాక రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు న్యాయవాదులతో చర్చించారు. హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు లేనందున ముందుకెళ్లవచ్చని న్యాయవాదులు సూచించినట్లు తెలిపారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేటి నుంచి నామినేషన్లు, ఇతర ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.