స్టాండ్ విత్ హర్ పేరుతో మహిళలను అవమానిస్తారా?..కాంగ్రెస్ సర్కార్‌పై కవిత ఫైర్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో మహిళల స్థితిగతులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

By -  Knakam Karthik
Published on : 8 March 2026 4:32 PM IST

Telangana, Kalvakuntla Kavitha, WomensDay2026, Telangana Jagruthi, StandWithHer, Congress Govt

స్టాండ్ విత్ హర్ పేరుతో మహిళలను అవమానిస్తారా?..కాంగ్రెస్ సర్కార్‌పై కవిత ఫైర్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూనే, సమాజంలో మహిళల స్థితిగతులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఒక రోజు మాత్రమే మహిళల గురించి గొప్పగా మాట్లాడటం సరికాదని, ప్రతి రోజూ మహిళా దినోత్సవంలా ఉండేలా పరిస్థితులు మారాలని ఆమె ఆకాంక్షించారు. ఇల్లు, పాఠశాల, ఆసుపత్రి ఇలా ఏ వ్యవస్థ నడవాలన్నా మహిళలే కీలకమని గుర్తు చేస్తూ, కేసీఆర్, జయశంకర్ వంటి మహనీయుల ఉనికికి వారి తల్లులే కారణమని పేర్కొన్నారు. ఆధిపత్యం ఏ రూపంలో ఉన్నా మహిళలు సహించవద్దని, వంటింటికే పరిమితం కాకుండా నిజమైన హక్కులు, సమానత్వం మరియు స్వేచ్ఛ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. చదువు, ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నా, రాజకీయ పార్టీలు వారికి తగిన అవకాశాలు ఇవ్వడం లేదని ఆమె విమర్శించారు.

సమాజ సేవ చేయాలనుకునే మహిళల కోసం తెలంగాణ జాగృతి ద్వారా 'లీడర్ ప్రోగ్రాం' చేపట్టి శిక్షణ ఇస్తామని, తమ సంస్థలో మహిళలకు పెద్దపీట వేస్తామని కవిత ప్రకటించారు. 33 శాతం రిజర్వేషన్ల సాధనలో జాగృతి పోరాటం చిరస్థాయిగా నిలుస్తుందని, ఢిల్లీ వేదికగా తాము చేసిన ధర్నాల వల్లే మహిళా బిల్లు సాధ్యమైందని ఆమె గుర్తు చేశారు. అయితే, జనగణన పేరుతో మహిళా బిల్లును జాప్యం చేయకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కులమతాలకు అతీతంగా మహిళలందరూ ఒకే కులమని, పురుషాధిక్యతను మరియు గృహహింసను ధైర్యంగా ఎదిరించాలని సూచించారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్టాండ్ విత్ హర్' కార్యక్రమాన్ని ఆమె తప్పుబట్టారు. మగవాళ్లు నిలబడితేనే మహిళలకు భద్రత ఉంటుందన్నట్లుగా ఆ కార్యక్రమం ఉందని, అది మహిళలను అవమానించడమేనని విమర్శిస్తూ.. మహిళలు, పిల్లలకు రక్షణ కల్పించడం ఈ ప్రభుత్వానికి చేతకాదా? అని ఆమె ప్రశ్నించారు.

Next Story