గిరిజ‌నుల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త‌.. రిజర్వేషన్లు 10 శాతానికి పెంపు.. త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి

ST quota hiked to 10 per cent in Telangana.గిరిజ‌నుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2022 8:01 AM IST
గిరిజ‌నుల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త‌..  రిజర్వేషన్లు 10 శాతానికి పెంపు.. త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి

గిరిజ‌నుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. విద్యా, ఉద్యోగ రంగాల్లో గిరిజ‌న రిజ‌ర్వేష‌న్ల‌ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ ఉత్వ‌ర్తులు జారీ చేసింది. ఈ మేర‌కు శుక్రవారం అర్ధరాత్రి దాటాక జీవో నెం.33 ను విడుదల చేసింది. చెల్లప్ప కమిషన్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని గిరిజ‌నుల ప్ర‌త్యేక స్థితిగ‌తుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వారికి రిజ‌ర్వేష‌న్లు పెంచుతున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఇది త‌క్ష‌ణం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని తెలిపింది. విద్య, ప్రభుత్వోద్యోగ నియామకాల్లో గిరిజనులకు ఈ రిజర్వేషన్లు అమలవుతాయని ఉత్వర్వుల్లో పేర్కొంది.

దీంతో రాష్ట్రంలో విద్య‌, ఉద్యోగ నియామ‌కాల్లో రిజ‌ర్వేష‌న్లు 64 శాతానికి చేరాయి. ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు (ఎ గ్రూపు-7, బి-10, సి-1, డి-7, ఇ-4) 29, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు వ‌ర్తిస్తాయి. శుక్ర‌వారం ప్రగతి భవన్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై సమీక్ష సమావేశం నిర్వహించి ఆమోదించారు. ఈ స‌మావేశంలో గిరిజ‌న సంక్షేమ‌శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్‌కుమార్‌, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

ముఖ్య‌మంత్రి హామీ నేప‌థ్యంలో..

తెలంగాణ జాతీయ స‌మైక్య‌త దినోత్స‌వం సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 17న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వ‌హించిన తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ స‌భ‌లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేర‌కు ఈ ఉత్వ‌ర్తులు విడుద‌ల అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజ‌నుల‌కు అమ‌ల‌వుతున్న ఆరు శాతం రిజ‌ర్వేష‌న్ల విధానాన్నే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వ‌ర‌కు అమ‌లు చేస్తూ వ‌చ్చింది. ఈ క్రమంలో వచ్చిన మార్పులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి జీవన స్థితిగతులను పరిగణలోకి తీసుకుని సీఎం కేసీఆర్ రిజర్వేషన్లను పెంచారు.

Next Story