Telangana: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం.. చిక్కుకున్న కార్మికులు
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది.
By అంజి
Telangana: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం.. చిక్కుకున్న కార్మికులు
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం దోమలపెంటలోని 14వ కిలోమీటర్ వద్ద ఇవాళ ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. నాలుగు రోజుల క్రితం ఎడమవైపు సొరంగం వద్ద మళ్లీ పనులు ప్రారంభం కాగా.. ఇవాళ ఉదయం పైకప్పు కూలింది. ఇందులో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. ఈ ఘటనపై ఎస్పీ వైభవ్ గైక్వాడ్ స్పందించారు. ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు ఉన్నారని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఆయన అక్కడి వెళ్లి సహాయక కార్యక్రమాలకు పర్యవేక్షిస్తున్నారు.
అటు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదం పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పై కప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు.