భువనగిరి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వండి : శంకరమ్మ
భువనగిరి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వండని పార్టీలను శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ కోరారు.
By Medi Samrat
భువనగిరి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వండని పార్టీలను శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ కోరారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద శ్రీకాంతా చారి చిత్రపటానికి నివాళులార్పించిన శంకరమ్మ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని టికెట్ అడిగానని తెలిపారు. ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ పదవులు ఇచ్చిందని విమర్శించారు. కేసీఆర్ నాకు టికెట్ ఇచ్చి గెలిపించాలని ఆమె కోరారు. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని.. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించకుండా తనకు మద్దతు ఇవ్వాలని.. ఇదే పార్టీలు తెలంగాణ అమరవీరులకు ఇచ్చే గౌరవమని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన అమరుల కుటుంబాలకు 10 ఏళ్లుగా న్యాయం జరగలేదన్నారు. నా బిడ్డతో పాటు 1000 మంది బిడ్డలు అమరులయ్యారన్నారు. ఆ కుటుంబాలకు ఇప్పటి వరకూ చట్ట సభల్లో గానీ, కనీసం నామినేటెడ్ పదవులు కూడా లేరన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేయని వారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లు అయ్యారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీ లు అమరవీరుల కుటుంబాలను గుర్తించాలన్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన శ్రీకాంత చారి తల్లిగా ఎంపీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను అడుగుతున్నానని.. సహకరించి అవకాశం కల్పించాలని కోరారు.