Telangana: రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు..భద్రతా ఏర్పాట్లపై స్పీకర్, మండలి ఛైర్మన్ సమీక్ష
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
By - Knakam Karthik |
Telangana: రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు..భద్రతా ఏర్పాట్లపై స్పీకర్, మండలి ఛైర్మన్ సమీక్ష
హైదరాబాద్: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో సభా నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై ఆదివారం శాసనసభ భవనంలోని కమిటీ హాల్‌లో శాసనసభ స్పీకర్, మండలి ఛైర్మన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సన్నాహక సమావేశానికి DGP శివధర్ రెడ్డి, ADGP విజయకుమార్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు విసి సజ్జనార్, అవినాష్ మహాంతి, సుధీర్ బాబు, ఇంటెలిజెన్స్ IG- కార్తికేయ, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్- కర్ణాకర్ హాజరయ్యారు.
ఈ సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ..రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ, శాసనసభ అధికారులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలి. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలి. శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలి. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తరుపున చర్యలు తీసుకోవాలి. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని అడ్డుకోవాలి, తద్వారా సమావేశాలు సజావుగా జరుగుతాయి..అని స్పీకర్ సూచించారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలి. అవసరమైన నోడల్ అధికారులను, లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలి. పెండింగ్ లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలి. తెలంగాణ పోలీసు దేశంలోనే సమర్ధవంతమైనది, మంచి పేరు ఉన్నది. మీ ఆద్వర్యంలో శాసనమండలి సమావేశాలు సజావుగా జరిగే విదంగా సహకరించాలి. ఈ సమావేశాల్లో ధర్నాలకు ఎక్కువగా పిలుపునిచ్చే అవకాశాలు ఉన్నాయి. చలో అసెంబ్లీ కార్యక్రమాలు జరగకుండా చూడండి. సమావేశాలకు హాజరయ్యే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని..మండలి స్పీకర్ సూచించారు.