రంగారెడ్డి జిల్లా: కల్తీ నెయ్యి తయారీ చేస్తున్న ముఠా వ్యవహారాన్ని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గుట్టు రట్టు చేశారు. శామీర్ పేటలోని తుముకుంటా వద్ద ఉన్న నెయ్యి పరిశ్రమపై పోలీసులు దాడి చేశారు. కేటుగాళ్లు నాసిరకమైన ముడి సరుకులు వాడి నెయ్యి తయారీకి తెరలేపారు. కుళ్లి పోయిన బటర్ ఉపయోగించి నెయ్యి తయారీ చేసి దానిని ఆకర్షణీయమైన లేబుల్స్ అతికించి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. కంపెనీ యాజమాన్యం యశోద, కృష్ణా, యాష్ కీర్తి, నందన్, రాధిక, శ్రీ చక్రా అనే పేర్లతో స్టికరింగ్ చేసి మార్కెట్‌లో విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి పరిశ్రమలో 4,500 కేజీల కల్తీ నెయ్యి, రెండు డ్రమ్స్ నిండా ప్యాకింగ్ చేయడానికి ఉన్న నెయ్యితో పాటు కుళ్ళి పొయిన బటర్‌ని సీజ్ చేశారు. నిర్వాహకులు వీర్ రాజుని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పరిశ్రమ కొనసాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ జిహెచ్ఎంసి అధికారుల నుండి ఎలాంటి అనుమతి పొందకుండానే నిర్వాహకుడు పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. బ్రాండెడ్ కంపెనీల స్టిక్కరింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించి ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులను మాత్రమే కొనాలి. లేదంటే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.