ఖమ్మం జిల్లాలో భయానక దృశ్యాలు.. సాయం కోసం బాధితుల ఆర్తనాదాలు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మంలోని అనేక ఇళ్లులు నీట మునిగాయి. మున్నేరు నది ఉప్పొంగి ప్రవహించడంతో పట్టణం, పరిసర ప్రాంతాలను ముంచెత్తింది.

By అంజి  Published on  1 Sept 2024 6:40 PM IST
Munneru Floods,  Khammam, Rescue Operation,

ఖమ్మం జిల్లాలో భయానక దృశ్యాలు.. సాయం కోసం బాధితుల ఆర్తనాదాలు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మంలోని అనేక ఇళ్లులు నీట మునిగాయి. మున్నేరు నది ఉప్పొంగి ప్రవహించడంతో పట్టణం, పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. వరద ఉధృతి పెరుగుతుండడంతో పలు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదరు చూస్తున్నాయి. ఖమ్మం కాల్వొడ్డు రోడ్డులోని వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని ఓ ఇంట్లో ఓ కుటుంబం చిక్కుకుపోయింది. ఇల్లు మొత్తం నీటమునిగింది, నీటి పైన బయటి గోడ మాత్రమే కనిపిస్తోంది.

మరో ఆందోళనకర ఘటనలో కరుణగిరిలోని సాయికృష్ణ నగర్‌లోని ఓ భవనం రెండో అంతస్తులోకి నీరు చేరడంతో ఐదుగురు చిన్నారులు సహా 10 మంది చిక్కుకున్నారు. వారు సాయం కోసం చూస్తున్నారు. చిక్కుకున్న నివాసితులలో ఒకరైన ఆకుల రాణి ఫోన్‌లో తమ దుస్థితిని నివేదించారు. వారు ఐదు గంటలకు పైగా చిక్కుకుపోయారని, ఇప్పుడు రెండవ అంతస్తులో నీటి మట్టం సగం వరకు ఉందని పేర్కొన్నారు. సహాయం కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు.

రెస్క్యూ ఆపరేషన్స్‌లో సహాయం చేయడానికి విశాఖపట్నంలోని నావికా స్థావరం నుండి హెలికాప్టర్‌ను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా స్థానిక హెలికాప్టర్లు పనిచేయలేకపోతున్నాయి. మున్నేరు నది పొంగిపొర్లడంతో ఖమ్మం అంతటా తీవ్ర వరదలు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి, అపార్ట్‌మెంట్లలో సెల్లార్లు నీటితో నిండిపోయాయి, రోడ్లు చెరువులను తలపించాయి. రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు హైదరాబాద్‌-విజయవాడ రహదారిలో భారీ వరదల కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నందున పరిస్థితి క్లిష్టంగానే ఉంది

Next Story