రంగారెడ్డి: రేవంత్ రెడ్డి నేతృత్వంలో రావిరాలలో జరుగుతున్న రాజీవ్ రైతు రణభేరి సభపైనే అందరి దృష్టి నెలకొన్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన ఈ సభకు ఎవరూ ఊహించని ఓ వ్యక్తి హాజరయ్యారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా కనిపించిన వ్యక్తి, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన సూరీడు సభా వేదికపై తళుక్కున మెరిశారు. రేవంత్ రెడ్డితో కలిసి ఫొటో దిగారు. ఆయన రాక సరికొత్త చర్చకు దారితీసింది. వైఎస్ మరణించినప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న సూరీడు.. ఇవాళ రేవంత్ సరసన కనపడటం చర్చనీయాంశమైంది.
రేవంత్ రెడ్డి యాత్రకు అధిష్టానం అనుమతి లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కామెంట్లు చేయడం.. సొంత కుంపటి పెట్టుకుంటారేమోనన్న వార్తలు వస్తున్న వేళ.. షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి సభలో సూరీడు ప్రత్యక్షమవడం నిజంగా రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. మరోపక్క షర్మిల, రేవంత్ రెడ్డి, సూరీడు కలిసి కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలూ సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఏం జరుగనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.