త్వరలో ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆటో డ్రైవర్లకు రూ. 12 వేలు
ధరణి పోర్టల్ స్థానంలో త్వరలోనే కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
By అంజి Published on 21 Feb 2024 6:29 AM ISTత్వరలో ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆటో డ్రైవర్లకు రూ. 12 వేలు
ధరణి పోర్టల్ స్థానంలో త్వరలోనే కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఫేక్ డాక్యూమెంట్స్‌తో ప్రభుత్వ భూములను కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గృహజ్యోతి, మహాలక్ష్మీ పథకాలను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడే వారి నుంచి ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపారు. గ్యాస్ సిలిండర్లపై రూ.500 రాయితీ ఇస్తామన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాలకు గానూ 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పామని, అందులో భాగంగా ఇప్పటికే రెండు అమలు చేశామన్నారు. త్వరలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేస్తామన్నారు. అలాగే ఆటో డ్రైవర్ల కు రూ. 12 వేలు ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినవి ఎన్ని అమలు చేసిందో చెప్పాలన్నారు మంత్రి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు వేస్తున్నామన్నారు. అభివృద్ధి కాంక్షించి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాటుపడే వారిని పార్టీ లోకి ఆహ్వానిస్తుమని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.