మరోసారి సోనూసూద్ ఉదారత
Sonu Sood Again Help For Needy People In Nizamabad. కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకుని రియల్ హీరో అయిన సోనూసూద్ తన ఉదారత చాటుకున్నాడు.
By Medi Samrat Published on 3 Jan 2021 4:05 PM IST
కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది వలసకూలీలను ప్రత్యేక వాహానాల్లో వారి స్వస్థలాలకు పంపించాడు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించారు. అంతేకాకుండా కష్టాలు చెప్పుకున్న ప్రతి ఒక్కరికి లేదనకుండా సాయం చేశాడు. ఉద్యోగాలు కోల్పోయి బాధపడుతున్న కొందరికి ఉద్యోగాలు సైతం ఇప్పించాడు.
తాజాగా సోనూసూద్ మరోసారి ఉదారత చాటుకున్నాడు. పది నెలల చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చులను భరించడానికి ముందుకొచ్చాడు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం గోవింద్‌పల్లిలో కనకం సుమన్, ఉషాశ్రీ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి అన్విక్ అనే అబ్బాయి ఉన్నాడు. అయితే.. పుట్టుకతోనే అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఇప్పటి వరకు ఆ బాలుడి వైద్యానికి రూ.10లక్షలు ఖర్చుచేశారు. ఇందుకోసం తమకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిని అమ్ముకున్నారు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో వైద్యం చేయించినా ఫలితం లేదు. దీంతో బాలుడిని హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
బాలుడిని పరీక్షించిన వైద్యులు బోన్ మ్యారో చికిత్స చేయాలని చెప్పారు. ఇందుకు దాదాపు రూ.20లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఆ మాటలు విన్న తల్లిదండ్రులు కుదేలైపోయారు. దీంతో ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. ప్రసార మాధ్యమాల ద్వారా సోనూసూద్ సేవల గురించి తెలుసుకుని.. స్థానిక అంగన్‌వాడీటీచర్ లత సహాయంతో వాట్సాప్ ద్వారా సోనూసూద్ వ్యక్తిగత కార్యదర్శికి తమ దీన స్థితిని వివరిస్తూ సమాచారం పంపించారు. వెంటనే స్పందించిన సోనూసూద్.. తనవ్యక్తిగత కార్యదర్శి నాగరాజు ద్వారా అంగన్‌వాడీ టీచర్ లతకు శనివారం మెసేజ్ పంపారు. రెయిన్‌బో ఆస్పపత్రికి వెళ్లి అక్కడి నుంచి తమకు ఫోన్ చేయాలని దానిలో సూచించారు. బాలుడికి అయ్యే ఖర్చును తాను భరిస్తానని చెప్పాడు.