తెలంగాణ ఎన్నికల్లో ప్రచార హోరు.. కీలకంగా మారిన పాటలు
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో రాజకీయ పార్టీల పాటలు కీలకంగా మారాయి. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు పాటలతో ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి.
By అంజి Published on 6 Nov 2023 4:30 AM GMTతెలంగాణ ఎన్నికల్లో ప్రచార హోరు.. కీలకంగా మారిన పాటలు
తెలంగాణ అంటేనే.. ఆటా.. పాట. తెలంగాణ సమాజంలో పాటకు ప్రత్యేక స్థానం ఉంది. నాటి నుంచి నేటి వరకు కష్టామొచ్చినా.. సంతోషమచ్చినా.. ప్రజలకు తోడుగా ఉన్నది పాటే. తెలంగాణ తొలి ఉద్యమానికి ఊపిరి పోసింది పాటే.. మలి ఉద్యమంలో భావోద్వేగాల్ని తట్టిలేపింది పాటే. పోరాటాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసి.. స్వరాష్ట్ర ఉద్యమాన్ని పల్లెపల్లెకు గడపగడపకు తీసుకెళ్లింది. తెలంగాణ ప్రజల మనస్సులోకి చొచ్చుకుపోయే పాటనే ఇప్పుడు ప్రచార అస్త్రంగా మార్చుకున్నాయి రాజకీయ పార్టీలు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు పాటలతో ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. పల్లె పదాలతో ప్రజల మనస్సుల్లోకి సులువుగా చొచ్చుకుపోయేలా పాటల్ని రూపొందించాయి. భారత రాష్ట్ర సమితి రూపొందించిన 'రామక్క పాట' ఊరువాడ దుమ్మురేపుతోంది.
ఇక మిగతా పార్టీలు ఇదే తోవ్వను అనుసరించాయి. కాంగ్రెస్, బీజేపీలు సైతం 'రామక్క' అంటూ పేరడి పాటలతో ముందుకొచ్చాయి. బీఆర్‌ఎస్‌కు పోటీగా ప్రజాక్షేత్రంలో పాటలను మార్మోగిస్తున్నాయి. నాటి నిజాం కాలం నుండి నేటి వరకు తెలంగాణ ప్రజా చైతన్యంలో పాటది కీలక భూమిక. జానపదుల నుంచి పుట్టుకొచ్చిన వేలాది పాటలు.. తెలంగాణ ప్రజలను స్వరాష్ట్ర ఉద్యమం వైపు నడిపించాయి. పాట.. జనాలను త్వరగా స్పందింపజేస్తుంది. తెలంగాణ ప్రజల్లో పాటకున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన పార్టీలు.. ఎన్నికల్లో పాటే ప్రధానస్త్రంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి.
బీఆర్‌ఎస్ రూపొందించిన రామక్క పాటలో తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ పోరాటం, రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, బీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలను పాట రూపంలో కళ్లకు కట్టినట్టు రూపొందించారు. 'గులాబీల జెండలే రామక్క.. గుర్తుల గుర్తుంచుకో రామక్క'' అంటూ సాగే ఈ పాటను.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తాండ్ర గ్రామానికి చెందిన గాయకులు కొమ్ము లక్ష్మమ్మ, బొల్లె సుశీల, శాంతమ్మ, కలమ్మ, అనసూయ పాడారు. సంగీత దర్శకుడు కల్యాణ్ కీస్ బృందం రూపొందించిన ఈ పాట.. తెలంగాణే కాదు.. విదేశాల్లోనూ మార్మోగుతోంది. ఈ పాటను బీఆర్‌ఎస్ ఆవిష్కరించింది.
ఈ పాటకొచ్చిన ప్రజాధరణతో కాంగ్రెస్ పేరడి పాటను రూపొందించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ పాటను రూపొందించింది. ఇక బీజేపీ కూడా ఇదే తరహాలో పాటను రూపొందించి..బీఆర్‌ఎస్ ప్రస్తావించిన అంశాలకు వ్యతిరేకంగా వైఫల్యాల్ని ఎండగడుతూ పాటను ప్రజల్లోకి తీసుకెళ్లింది. రామక్క పాటలు ఎన్నికల వేళ విస్తృతంగా వైరల్ అయ్యాయి. నియోజకవర్గాల్లోని వివిధ పార్టీల అభ్యర్థులు సైతం తమకు అనుకూలంగా అదే పాటను మలుచుకుంటున్నారు. తాము చేపట్టిన కార్యక్రమాలు, పార్టీ ప్రాధాన్యాన్ని వివరిస్తూ పాటలను వైరల్ చేస్తున్నారు.