రోజు రోజుకు మానవ సంబంధాలు మంటగలసిపోతున్నాయి. పిల్లల్ని కని ఎన్నో కష్టాలను ఎదుర్కొని వారిని ప్రయోజకుల్ని చేసి మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. కానీ తల్లిదండ్రులకు సేవ చేయాల్సిన కొడుకు, కూతుర్లే వారిని నిర్ధాక్షిణ్యంగా వృద్ధాశ్రమంలో లేదా నడిరోడ్డు మీద వదిలి వేస్తున్న ఘటనలు ఎన్నో.. మరెన్నో. తాజాగా కన్నతల్లిని కంటికి రెప్పోలే కాపాడుకోవాల్సిన కొడుకే.. ఆమెను నడి రోడ్డు మీద వదిలి వెళ్లిపోయాడు. ఈ ఘటన వనస్థలిపురం మన్సురాబాద్‌లో జరిగింది.
కొడుకు ఇప్పుడే వస్తానని చెప్పి తల్లిని రోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. దిక్కు తోచని ఆ తల్లి కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది. ఈ పరిస్థితి గమనించిన ఆ కాలనీవాసులు ఆ తల్లిని అక్కున చేర్చుకున్నారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లి గ్రామం సీత్యా తండాకు చెందిన తల్లి ధర్మీకి లక్ష్మణ్ అనే కొడుకు ఉన్నాడు.
గత రెండు రోజుల క్రితం కొడుకు లక్ష్మణ్ ఆటోలో తల్లిని తీసుకొచ్చి ఇప్పుడే వస్తానని చెప్పి నడిరోడ్డు మీద కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. ఆ తల్లి రోడ్డుపై ఒంటరిగా ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అబ్దుల్లాపూర్ మెట్ లోని ఆలేటి వృద్ధాశ్రమానికి తల్లి ధర్మీని తరలించారు. కొడుకు లక్ష్మణ్ గురించి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.