గుడ్‌న్యూస్..రేపటి నుంచి మరో 25 రిజిస్టర్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్
తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik
గుడ్‌న్యూస్..రేపటి నుంచి మరో 25 రిజిస్టర్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్
తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రేపటి నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అందుబాటులోకి రానుందని తెలిపారు. అధిక రద్దీ ఉన్న కార్యాలయాల్లో అదనపు సిబ్బంది నియామకం చేపడతామన్నారు. వచ్చే నెల చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ అమలు చేస్తామన్నారు. ప్రజల సమయాన్ని ఆదా చేసేందుకు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలకు స్వీకారం చుట్టామని తెలిపారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కు వచ్చే కొనుగోలుదారులు, అమ్మకందారులు గంటల తరబడి చెట్ల కింద నిరీక్షించవలసిన పరిస్థితిని మార్చుతూ, సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ఆధునికీకరించడమే కాక, స్లాట్ బుకింగ్ విధానాన్ని దశలవారీగా అమలులోకి తీసుకొస్తున్నామని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఇప్పటికే గత నెల పదవ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు చేశామని అక్కడ విజయవంతం కావడంతో ఈ నెల 12వ తేదీ నుంచి మరో 25 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అమలు చేయబోతున్నామని ప్రకటించారు. వచ్చే నెల చివరినాటికి రాష్ట్రంలోని 144 సబ్- రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, సమర్థమైన సేవలందించడమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకురావడమే కాకుండా వాటిని అమలు చేయవలసిన బాధ్యత అధికారులదే స్పష్టం చేశారు.
పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని సులభతరం చేయడానికి మరియు 48 స్లాట్స్ కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయాలలో ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తామని. ఇప్పటికే ప్రయోగాత్మకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు మరియు సిబ్భందిని నియమించడం జరిగిందని తెలియజేస్తూ విజయవంతమైన ఈ విధానాన్ని ఉప్పల్, మహేశ్వరం మరియు మంచిర్యాల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ప్రవేశపెడుతూ అదనంగా ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ ని నియమించడం జరుగుతుంది అని తెలియజేశారు. స్లాట్ బుకింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యస్తికరణ చేస్తున్నామని, ఇందులో భాగంగా అధిక రద్దీ, తక్కువ రద్దీ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని విలీనం చేసి పనిభారాన్ని సమానం చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని , ఇందులో భాగంగా ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట మరియు సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల అధికార పరిధి విలీనం విజయవంతం కావడంతో షాద్ నగర్ మరియు ఫారూక్ నగర్ సిద్దిపేట మరియు సిద్దిపేట (రూరల్) విలీనం చేయడం జరిగిందన్నారు.
రేపటి నుంచి స్లాట్ బుకింగ్ అమలు కానున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు :
హైదరాబాద్ ఆర్.ఓ. ఆఫీసు, హైదరాబాద్ ఆర్.ఓ. ఆఫీసు సౌత్ , నారపల్లి, ఘట్కేసర్, మల్కాజిగిరి, ఉప్పల్, కాప్రా, బీబీనగర్, సిద్దిపేట్, సిద్దిపేట్ రూరల్, గజ్వేల్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ ఆర్.ఓ. ఆఫీసు, జనగాం, ఘన్పూర్, నర్సంపేట, కల్వకుర్తి, నారాయణపేట, మహేశ్వరం, రంగారెడ్డి ఆర్.ఓ. ఆఫీసు, షాద్ నగర్, ఫరూక్ నగర్ , వనస్థలిపురం, శేరిలింగంపల్లి.