తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ యూనిట్‌

ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి స్కైరూట్‌ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

By అంజి  Published on  22 Jan 2025 9:15 AM IST
Skyroot company, private rocket manufacturing unit, Telangana

తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ యూనిట్‌

ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి స్కైరూట్‌ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్‌తో దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయు) పై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం.. స్కైరూట్ కంపెనీ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం కంపెనీ దాదాపు రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

ఈ ఒప్పందం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థ అత్యాధునిక సాంకేతిక అంతరిక్ష రంగంలో విజయం సాధించటం గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణకు చెందిన యువకులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించటంతో పాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు అభినందించారు. స్కైరూట్‌ కంపెనీతో ప్రభుత్వ భాగస్వామ్యం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటిచెపుతుందని శ్రీధర్ బాబు అన్నారు. త్వరలోనే హైదరాబాద్‌ ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని స్కై రూట్ కో-ఫౌండర్ పవన్‌ కె చందన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ లక్ష్య సాధనలో భాగం పంచుకుంటామని చెప్పారు.

Next Story