సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. విచారణలో ర్యాగింగ్‌కు పాల్పడ్డారని తెలియడంతో.. ఆరుగురు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేశారు. 2019-20 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు వసతి గృహం నుంచి శాశ్వతంగా పంపించి వేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఏం జరిగిందంటే..?
హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి సూర్యాపేటలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఇంటి నుంచి బయలుదేరిన అతడు శనివారం రాత్రి కాలేజీ హాస్టల్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో ద్వితీయ సంవత్సరానికి చెందిన 25 మంది విద్యార్థులు అతడిని తమ గదిలోకి తీసుకుపోయారు. అక్కడ ఫస్ట్ఇయర్ విద్యార్థి చేత బట్టలు విప్పించారు. అనంతరం వారు తమ ఫోన్లలో అతడి వీడియోలు తీశారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారు అతడిపై దాడికి పాల్పడ్డారు. ట్రిమ్మర్ తీసుకుని గుండు గీసేందుకు వారు యత్నించగా.. ఆ విద్యార్థిని తప్పించుకుని అతడి గదికి వెళ్లిపోయాడు. వెంటనే విషయాన్ని తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. బాధితుడి తండ్రి డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు కళాశాల హాస్టల్‌కు చేరుకున్నారు.