Telangana: విషాదం.. గోదావరి నదిలో ఆరుగురు బాలురు గల్లంతు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్ద విషాదం చోటు చేసుకుంది.

By అంజి
Published on : 8 Jun 2025 7:06 AM IST

Six Feared Drowned, Bathing, Medigadda Barrage Reservoir, Telangana

Telangana: విషాదం.. గోదావరి నదిలో ఆరుగురు బాలురు గల్లంతు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్ద విషాదం చోటు చేసుకుంది. బ్యారేజీ వద్ద గల రిజర్వాయర్ లో శనివారం సాయంత్రం స్నానం చేస్తుండగా ఆరుగురు గల్లంతయ్యారు. వారు నీటిలో మునిగిపోయినట్లు సమాచారం. అంబటిపల్లి, కొర్లకుంట గ్రామాలకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది స్నానానికి మేడిగడ్డకు వెళ్లారు. వారి వెంట మధ్య వయస్కుడైన పత్తి వెంకటస్వామి (45) కూడా ఉన్నారు. గల్లంతైన వారిని మహదేవ్ పూర్ మండలం అంబటిపల్లికి చెందిన పత్తి మధుసూధన్ (18), పత్తి శివ మనోజ్ (15), తొగరి రక్షిత్ (13), కర్నాల సాగర్ (16)గా గుర్తించారు. మహాముత్తారం మండలం పోర్లకుంటకు చెందిన పాండు (18), రాహుల్ (19)లు ఉన్నారు.

అంబటిపల్లికి చెందిన శివ, పత్తి వెంకటస్వామి సురక్షితంగా బయటకు వచ్చారు. వెంకటస్వామి మిగతా వారిని నీటి నుండి బయటకు రావాలని కోరినప్పటికీ యువకులు నిరాకరించారని సమాచారం. మధుసూధన్, శివ మనోజ్ లు పత్తి వెంకటస్వామి కుమారులు. ఇటీవల ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాల కారణంగా మేడిగడ్డ వద్ద గోదావరిలో నీటి ప్రవాహం పెరిగిందని అంబటిపల్లి (మేడిగడ్డ)కి చెందిన అశోక్ పట్టి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు తెరిచి ఉండటంతో నీరు దిగువకు ప్రవహిస్తోందని చెప్పారు. మహదేవ్ పూర్ సబ్-ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించి, తప్పిపోయిన యువకుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై మంత్రి శ్రీధర్‌ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ కిరణ్‌లను ఆదేశించారు.

Next Story