గుండెపోటుతో మృతి చెందిన అన్న చేతికి రాఖీ కట్టిన చెల్లి

పెద్దపల్లి జిల్లాలో రాఖీ పండుగ రోజే అన్న మృతి చెందడంతో సోదరి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చనిపోయిన అన్న చేతికి రాఖీ కట్టింది.

By అంజి  Published on  30 Aug 2023 6:58 AM GMT
Peddapally district, rakhi, Heart attack

గుండెపోటుతో మృతి చెందిన అన్న చేతికి రాఖీ కట్టిన చెల్లి

పెద్దపల్లి జిల్లాలోని ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. రాఖీ పండుగ రోజే అన్న మృతి చెందడంతో సోదరి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చనిపోయిన అన్న చేతికి రాఖీ కట్టిన వైనం చూసి స్థానికులు సైతం కన్నీటి పర్వంతమయ్యారు. ఇటీవల యువకులు, మధ్య వయస్కులు ఉన్నట్టుండి ఒక్కసారిగా కింద కుప్పకూలిపోయి పడిపోయి గుండెపోటుకు గురవుతున్నారు. ఇలాంటి సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. అప్పటి వరకు తనతో నవ్వుతూ మాట్లాడిన అన్న ఇక లేడు అనే విషయం జీర్ణించుకోలేక పోయింది ఓ చెల్లి. అన్న మరణించాడని తెలియగానే ఒక్కసారిగా షాక్‌కి గురైంది. సంతోషంతో రాఖీ కట్టడానికి వచ్చిన ఆ చెల్లికి అన్న మరణించడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చివరిసారిగా అన్న మృతదేహానికి రాఖీ కట్టిన ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు మండలంలో ఉన్న ధూళికట్టలో చౌదరి కనకయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈ రోజు రాఖీ పండగ సందర్భంగా ఉదయమే కనకయ్యకు రాఖీ కట్టేందుకు అతని సోదరి గౌరమ్మ వచ్చింది. కనకయ్య అప్పటిదాకా సంతోషంగా చెల్లి గౌరమ్మతో మాట్లాడాడు. చెల్లితో మాట్లాడుతుండగానే ఒక్కసారిగా కనకయ్య కుప్పకూలి కింద పడిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని స్థానిక హాస్పిటల్ కి తరలించగా అతను గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టరు నిర్ధారించారు. ఎంతో సంతోషంగా రాఖీ కట్టడానికి వచ్చిన ఆయన సోదరి గౌరమ్మ పుట్టెడు దుఃఖంతో కడసారిగా కనకయ్య మృతదేహానికి రాఖీ కట్టి అన్నను సాగనంపింది.

Next Story