చిన్న బతుకమ్మ రోజు విషాదం.. చెరువులో పడి ముగ్గురు మృతి

సిద్దిపేట జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జగదేవపూర్ మండలం తీగూల్ గ్రామంలో బతుకమ్మ పండగపూట ముగ్గురు చెరువులో పడి మృతి చెందారు.

By అంజి  Published on  15 Oct 2023 7:09 AM IST
Siddipet,  Bathukamma festival, sanitation workers, Telangana

చిన్న బతుకమ్మ రోజు విషాదం.. చెరువులో పడి ముగ్గురు మృతి

సిద్దిపేట జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జగదేవపూర్ మండలం తీగూల్ గ్రామంలో బతుకమ్మ పండగపూట ఆ గ్రామంలో చీకట్లో అలుముకున్నాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా రకరకాల పువ్వులతో బతుకమ్మను తయారు చేసి మహిళలు, చిన్న పిల్లలు, యువతులు ఒక దగ్గర చేరి ఎంతో సంతోషంగా ఆడుకుంటారు. అనంతరం బతుకమ్మను చెరువులో లేదా కుంటలో వదిలివేయడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే బతుకమ్మ పండగ సందర్భంగా చెరువులో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ముగ్గురు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు చెరువులో దిగారు. అనంతరం ముగ్గురు కార్మికులు చెత్తను తొలగిస్తుండగా ఒక్కసారిగా ఆ నీటిలో గల్లంతయ్యారు.

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, పక్క గ్రామాల నుంచి గజ ఈతగాళ్లను రప్పించి వారికోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. చెరువులో నుండి ఇద్దరు కార్మికుల మృతదేహాలను బయటకు తీశారు. మరో మృతదేహం కోసం పోలీసులు చెరువులో గాలిస్తున్నారు. చిన్న బతుకమ్మ పండుగ రోజే ముగ్గురు కార్మికులు చనిపోవడంతో ఆ మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ సంఘటనతో గ్రామంలో బతుకమ్మ సంబరాలు మధ్యలోనే ఆపేశారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story