రేవంత్ రెడ్డి సంభాషణలు వినేందుకు.. అధికారులు డివైస్‌లను అమర్చారు: కాంగ్రెస్ నేత
ఫోన్ ట్యాపింగ్.. తెలంగాణ రాజకీయాలను ప్రస్తుతం కుదిపేస్తూ ఉంది. ట్యాపింగ్ టీమ్ అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 March 2024 1:00 PM ISTరేవంత్ రెడ్డి సంభాషణలు వినేందుకు.. అధికారులు డివైస్‌లను అమర్చారు: కాంగ్రెస్ నేత
ఫోన్ ట్యాపింగ్.. తెలంగాణ రాజకీయాలను ప్రస్తుతం కుదిపేస్తూ ఉంది. ట్యాపింగ్ టీమ్ అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిత్యం కొత్త వ్యక్తుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. పలువురు నేతల పాత్ర ఉన్నట్లు తేలింది. అన్ని శాఖల అధికారులు ఇలాంటి పనులకు దూరంగా ఉండాలని కఠినంగా హెచ్చరించాలని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సభ్యుడు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రవిగుప్తాకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని.. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని జీ నిరంజన్ ఆరోపించారు. ముగ్గురు ఉన్నతాధికారులు కీలకమైన రెవెన్యూ, పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారని.. రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గర ఇల్లు అద్దెకు తీసుకుని ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారని వెల్లడించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మావోయిస్టుల కదలికల కోసం వాడే డివైస్ ను కాంగ్రెస్ నాయకులకు వాడారని ఆరోపించారు.
డిజిపి రవి గుప్తాకు రాసిన లేఖలో నిరంజన్, “స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబి) అత్యున్నత స్థాయి అధికారులు చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన పనులకు పాల్పడడం చాలా దురదృష్టకరం. ఈ పనులు వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఇంతకు ముందు తెలంగాణ పోలీసుల సమర్ధతను మెచ్చుకున్నాం కానీ.. ఫోన్ ట్యాపింగ్‌లో తేలిన విషయాలు ఆ శాఖకు తల దించుకునేలా చేశాయి. సైబర్ నేరాలను అరికట్టాలని భావించిన తెలంగాణ పోలీసులు సైబర్ నేరాలను ఆశ్రయించారు" అని తెలిపారు. రేవంత్‌రెడ్డి సంభాషణలను వినేందుకు ఎస్‌ఐబీ అధికారులు ఓ డివైజ్‌ను అమర్చినట్లు సమాచారం ఉందని అన్నారు.
రుజువులను నాశనం చేశారనే ఆరోపణలు:
అధికారులు హార్డ్ డిస్క్‌లను విసిరేశారని, ఇదంతా నేరగాళ్లు చేసే పనేనని ఏఐసీసీ సభ్యుడు అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలో ఎస్ఐబి అధికారులు ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. సంభాషణలను రికార్డ్ చేయడానికి ఇజ్రాయెల్ నుండి తెప్పించిన పరికరాన్ని అమర్చారు. పాలస్తీనాతో సుదీర్ఘ కాలంగా యుద్ధం చేస్తున్నందున ఇజ్రాయెల్ తయారు చేసిన ఇటువంటి పరికరాలు ఇజ్రాయెల్‌కు అవసరం కావచ్చునని ఆయన అన్నారు.
“అయితే మనకి వాటి అవసరం ఏమిటి? అంతేకాదు.. సంబంధిత కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండా తీసుకొచ్చారు. నక్సలైట్లపై నిఘా కోసం ఈ పరికరం అవసరమైతే హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఎందుకు అమర్చారు? ఈ ఎస్‌ఐబీ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు దండుకున్నట్లు వార్తాపత్రికల్లో కూడా ప్రచురితమైంది. ఈ వ్యక్తులు పోలీసులా లేదా దొంగలా?” అని నిరంజన్ అన్నారు.
తాము మొత్తం పోలీసు శాఖను తప్పుపట్టడం లేదని, అయితే ఇలాంటి కార్యకలాపాలతో సంబంధం ఉన్న అధికారులు ప్రతి జిల్లాలో ఉన్నారని నిరంజన్ ఆరోపించారు. సదరు అధికారి ఒకరు ధరణి యాప్‌ను ఇష్టానుసారంగా వినియోగించుకుని భూకబ్జాలకు పాల్పడ్డారని స్థానిక మీడియాలో ఒక వార్త ప్రచురితమైందని గుర్తు చేశారు. ప్రజాసమస్యలను తగ్గించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో మార్పులకు ఉత్తర్వులు జారీ చేసినా ఓ అధికారి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి.. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కు మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకరరావులే బాధ్యులని ఆరోపించారు.
‘ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది’
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్రంలోని ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్ష పార్టీల నాయకులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అదే విధంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌ను దుర్వినియోగం చేసిందని నిరంజన్ ఆరోపించారు.