కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సీతంపేటలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై చంద్రశేఖర్ యాదవ్ (SI) బలవన్మరణానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నెల 17న ఎస్సై చంద్రశేఖర్ యాదవ్ భార్య దివ్య కడుపునొప్పి తీవ్రతతో మనస్తాపానికి గురై గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకుంది. భార్య అకస్మాత్తుగా మృతి చెందడంతో చంద్రశేఖర్ యాదవ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
కుటుంబ సభ్యులు, సహచరులు ఆయనను ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన మానసికంగా కుంగి పోయాడు. భార్య లేకుండా జీవించలేకపోయాడు. దీంతో అదే ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వరుస మరణాలతో ఇద్దరు చిన్న పిల్లలు అనాథలుగా మారారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.