రియల్‌ ఎస్టేట్‌ పేరుతో అమాయకులను మోసం.. శుభోదయం ఇన్‌ఫ్రా ఎండీ అరెస్ట్‌

హైదరాబాద్‌: అధిక వడ్డీ పేరుతో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మోసాలకు పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

By అంజి  Published on  28 Jun 2024 12:50 PM IST
Shubhodayam Infra MD, arrest, fraud, Real estate

రియల్‌ ఎస్టేట్‌ పేరుతో అమాయకులను మోసం.. శుభోదయం ఇన్‌ఫ్రా ఎండీ అరెస్ట్‌ 

హైదరాబాద్‌: అధిక వడ్డీ పేరుతో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మోసాలకు పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తక్కువ ధరకి డబుల్ బెడ్ రూములు లేదా ఫ్లాట్లు ఇవ్వడం జరుగుతుందని.. కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ ఇస్తామని.. ఇలా రకరకాలుగా ప్రకటనలు చేస్తూ అమాయపు జనాలను మోసం చేస్తున్నారు. జనాలు కూడా ఏమీ ఆలోచించకుండా రియల్ ఎస్టేట్ యజమానులను గుడ్డిగా నమ్మి లక్షల్లో డబ్బులు పెట్టి కోల్పోతున్నారు. సాహితీ ఇన్ ఫ్రా సంస్థలో డబ్బులు పెట్టి కోల్పోయిన బాధితులు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు. ఇటువంటి సంఘటనే మరొకటి జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.

లక్ష్మీ ప్రసాద్ అనే వ్యక్తి శుభోదయం ఇన్‌ ఫ్రా చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతను జనగామలోని ఖిలాషాపూర్ దగ్గర వెంచర్ల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డాడు. పెద్ద ఎత్తున వెంచర్లు వేస్తున్నామని ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో అధిక వడ్డీతో సహా రిటర్న్స్ ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి బాధితులను నమ్మించి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. ఈ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మీప్రసాద్ పలువురు అమాయకులను నమ్మించి వారి వద్ద నుండి పది కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. అధిక వడ్డీ అనగానే జనం ముందు వెనుక ఆలోచించకుండా డబ్బులు పెట్టేశారు.

అయితే అక్కడ ఎటువంటి వెంచర్లు వెయ్యలేదని.. తెలుసుకున్న బాధితులు తమ మోసపోయామని గ్రహించి లక్ష్మీప్ర సాద్ ను కలిసి తమ డబ్బులను తిరిగి ఇవ్వమని అడిగారు. అందుకు లక్ష్మీప్రసాద్ డబ్బులు తిరిగి ఇచ్చేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో బాధితులందరూ కలిసి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించిన.. అనంతరం శుభోదయం ఇన్‌ఫ్రా చైర్మన్ లక్ష్మీప్రసాద్ తో పాటు అకౌంటెంట్ వెంకట సత్యను అరెస్టు చేశారు.

Next Story